Begin typing your search above and press return to search.

జనవరి 1 నుంచి కాదు ఉగాది నుంచి ఏపీలో ఫ్రీ బస్సు ఆఫర్

తాజాగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకున్నారని.. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్న ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 6:30 AM GMT
జనవరి 1 నుంచి కాదు ఉగాది నుంచి ఏపీలో ఫ్రీ బస్సు ఆఫర్
X

సూపర్ సిక్స్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కూటమికి తిరుగులేని అధికారాన్ని అప్పజెప్పారుఏపీ ప్రజలు. ఎన్నికల వేళ హామీలు ఇచ్చినంత స్పీడ్ గా కానప్పటికీ.. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా తాము ఇచ్చిన హమీని అమలు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఇటీవల కాలంలో ప్రభావం చూపుతున్న ఫ్రీబీస్ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. నిజానికి ఈ హామీ తెలుగు రాష్టాల్లో సూపర్ హిట్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత సర్కారు కొలువు తీరిన వెంటనే.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని షురూ చేయటం తెలిసిందే.

దీనిపై ఆటో డ్రైవర్ల నుంచి ఆందోళన మొదలైనప్పటికి మహిళల నుంచి వచ్చే సానుకూల స్పందన ముందు.. ఆటో డ్రైవర్ల ఆందోళన కొంతచికాకు పెట్టినప్పటికీ.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లు రేవంత్ సర్కారు వ్యవహరిస్తోంది. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఎన్నికల వేళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేసేందుకు బాగా సమయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

తాజాగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకున్నారని.. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్న ప్రచారం సాగింది.అయితే.. ఆ వార్తలో నిజం లేదని.. అసలు వాస్తవం ఏమంటే.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

నిజానికి సంక్రాంతి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న ఉత్సాహాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తే.. సంబంధిత శాఖా మంత్రితో పాటు అధికారులు రియాక్టు అవుతూ.. జీరో టికెటింగ్ విధానం.. ఇతర ఏర్పాట్లకు కొంత టైం పడుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. పదిహేను రోజుల్లో ఇంత పని చేయటం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. ఉగాది ముహుర్తంగా ఫిక్సు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడ ఎదురవుతున్న సమస్యల్ని గుర్తించాలని.. అవేమీ ఏపీలో ఎదురుకాకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కాస్త ఆలస్యం కావొచ్చేమో కానీ.. మిగిలిన రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యలు మాత్రం ఏపీ మహిళలకు ఎదురు కావని చెబుతున్నారు. అదెంత వరకు నిజమో తేలాలంటే.. ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే.