Begin typing your search above and press return to search.

ఉచిత గ్యాస్ కి శ్రీకాకుళం ఎంచుకున్న బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి తరఫున ఒక భారీ హామీని నెరవేరుస్తున్నారు. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 10:30 PM GMT
ఉచిత గ్యాస్ కి శ్రీకాకుళం ఎంచుకున్న బాబు
X

ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి తరఫున ఒక భారీ హామీని నెరవేరుస్తున్నారు. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు. దీపావళి వేళ తొలి సిలిండర్ తో ఈ పధకం మొదలు కానుంది పండుగ వేళ ప్రతీ ఇంటిలో దీపాలు వెలిగించాలని అనందాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. ఈ పథకం లాంచనంగా నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

దానికి ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు ఎంచుకున్నారు. ఆ రోజున అక్కడ నుంచి ఆయన ఉచిత గ్యాస్ పధకాన్ని ప్రారంభిస్తారు. దాంతో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నేతలతో పాటు కూటమి నేతలు అంతా బాబు రాక కోసం ఎదురు చూస్తున్నారు

ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చారు. కానీ సీఎం గా అయ్యాక మాత్రం ఆయన తొలిసారి నవంబర్ ఒకటో తేదీనే వస్తున్నారు. దాంతో జిల్లాకు బాబు ఏ వరాలు ప్రకటిస్తారో అన్న చర్చ కూడా సాగుతోంది.

చంద్రబాబు బహిరంగ సభ ఇచ్చాపురంలో సాగనుంది. దాంతో సభకు తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అయింది. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారు. వంశధార నాగవళి నదుల అనుసంధానంతో పాటు మూలపేట పోర్టు పూర్తి చేయడం, జిల్లాకు ఎయిర్ పోర్టు అలాగే భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకుని రావడం అన్నది కూడా బాబు తన ఆలోచనలుగా ప్రకటించారు

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు కూడా కూటమికే ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజానీకానికి బాబు వరాలు ప్రకటిస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలోనే కాకుండా ఏపీలోనూ అత్యంత వెనకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం దశ తిరగాలీ అంటే పరిశ్రమలు స్థాపన జరగాలని అంతా కోరుతున్నారు. మరి బాబు ఆ దిశగా కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చాలా నెలల తరువాత జిల్లాకు సీఎం హోదాలో వస్తున్న బాబు మీద అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా శ్రీకాకుళం నుంచి బాబు రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తారో అన్న ఉత్కంఠ కూడా అందరిలో ఉంది.