Begin typing your search above and press return to search.

ఫ్రీ గ్యాస్ సిలిండర్ కి కండిషన్లు అప్లై ?

అలాంటిది మూడు గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 3:58 PM GMT
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కి కండిషన్లు అప్లై ?
X

ఉచిత గ్యాస్ పధకాన్ని ఈ దీపావళి నుంచి ఏపీలో అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద మంత్రుల స్థాయిలో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. దాంతో లబ్దిదారులలో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. ఇపుడు వంట గ్యాస్ ఎనిమిది వందల రూపాయల దాకా ఉంది.

అలాంటిది మూడు గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏడాదికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా దక్కినట్లే అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే పేద కుటుంబాలు కోటీ 30 లక్షలకు పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్క ఎలా అంటే వీరంతా తెల్లకార్డు దారులుగా ఉన్నారు. వీరందరికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఏడాదికి ఇవ్వడం అంటే ప్రభుత్వానికి అది అతి పెద్ద ఆర్థిక భారం అవుతుంది అని అంటున్నారు.

దాంతో ఏమి చేయాలన్న దాని మీద ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లను చెప్పలేదు కర్ణాటక తెలంగాణాలో. అక్కడ అయిదు వందలకు గ్యాస్ సిలిండర్లను పెదలను ఇస్తున్నారు. అంటే మూడు వందల సబ్సిడీ అన్న మాట.అయితే అది మూడు అని లెక్క చెప్పలేదు. ఏడాది మొత్తం పేదలకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే అన్ని అని అంటున్నారు.

ఏపీలో అయితే మూడుకే పరిమితం చేస్తూ ఉచితం అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా అది ఆర్ధిక భారమే. కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేసింది. మరో వైపు చూస్తే ఏపీలో కోటీ 30 లక్షల మంది తెల్లకార్డుదారులు పేదలు అంటే అందులో చాలా మంది అప్పనంగా తెల్ల రేషన్ కార్డుని గత ప్రభుత్వంలో పొందారు అని కూడా అంటున్నారు.

దాంతో అర్హత లేని తెల్ల రేషన్ కార్డులను ఏరి వేస్తారని ప్రచారం సాగుతోని. దాని కోసం ఒక అతి పెద్ద డ్రైవ్ ని కూడా నిర్వహిస్తారు అని అంటున్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు అంటూ డ్రైవ్ ని పెట్టి అనర్హులకు కోత పెట్టారు.

ఇపుడు ఏపీలో ఏ సంక్షేమ పధకం అమలు చేయాలన్నా తెల్ల రేషన్ కార్డునే ప్రమాణంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెల్ల రేషన్ కార్డుదారులు గత ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు అని కూడా ప్రచారం ఉంది. సామాజిక పెన్షన్ల నుంచి మొదలు పెడితే ప్రతీ సంక్షేమ పధకం అసలైన పేదలకే ఇవ్వాలని కూటమి సర్కార్ గట్టిగా భావిస్తోంది అని అంటున్నారు.

అందువల్ల దాని కోసం అతి పెద్ద కసరత్తునే సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం కైవైసీని నమోదు చేసుకోవాలని గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు ని లింక్ చేయాలని కూడా విధి విధానాల్లో పేర్కొంటారు అని అంటున్నారు.

అలా చేస్తే కనుక ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంక్ అకౌంట్లు అన్ని లెక్కలూ తేలుతాయని అపుడు అసలైన పేదలు ఎవరో బయటకు వస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నది నిరుపేదలకే ఇవ్వాలని ప్రభుత్వం పూర్తి పట్టుదలతో ఉందని అంటున్నారు.

మరో వైపు కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల్ పధకంలోకి దీనిని చేర్చాలని కూడా చూస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్ధిక భారం పూర్తిగా లేకుండా పోతుందని కూడా ఆలోచిస్తున్నారు. ఉజ్వల్ స్కీం లో అయితే పూరెస్ట్ ఆఫ్ పూర్ కే ఈ స్కీం వర్తింపచేస్తారు.

ఇవన్నీ పక్కన పెడితే అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా చంద్రబాబు ఉచిత గ్యాస్ పధకాన్ని పారంభిస్తారు అని అంటున్నారు. త్వరలో ఈ పధకం కోసం విధి విధనాలను కూడా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. చూడాలి మరి ఉచిత గ్యాస్ ఎవరికి దక్కుతుందో. ఎవరికి గ్యాస్ మాత్రమే మిగులుతుందో అన్నది చర్చ గా ఉందిపుడు.