ఇక, ఆక్రమణలకు చెక్.. 'ఎఫ్‌టీఎల్' నిర్ధారణకు రంగం రెడీ!
హైదరాబాద్ సహా.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక, ఆక్రమణలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది
By: Tupaki Desk | 25 Sep 2024 1:27 PM GMTహైదరాబాద్ సహా.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక, ఆక్రమణలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఫుల్ ట్యాంక్ లెవిల్(చెరువులు, నదుల పూర్తిస్థాయి నీటి మట్టం చేరే ప్రాంతాలు)ను నిర్ధారించాలని సర్కారు ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సహా.. చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల(రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి) పరిధిలో ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు కలెక్టర్లు సిద్ధమయ్యారు. దీనిని పూర్తి చేసి.. సంబంధిత ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో ఇకపై ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టేందుకు వీలు ఉండదు.
ఏంటీ ఎఫ్‌టీఎల్?
అసలు ఎఫ్‌టీఎల్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియని విషయం. సాధారణంగా ఒక చెరువు, లేదా నది పూర్తిస్థాయిలో నీటిని తీసుకునేందుకు, పారేందుకు స్థలాన్నితీసుకుంటుంది. అది ఎంత వరకు అయితే.. నీటిని తీసుకునే అవకాశం ఉంటుందో అంత వరకు స్థలాన్ని వదిలి పెట్టాలి. దీనినే ఫుల్ ట్యాంక్ లెవిల్(ఎఫ్‌టీఎల్)గా పేర్కొంటారు. అయితే.. ఇలా నదులు, చెరువులు స్వేచ్ఛగా నీటిని తీసుకునే అవకాశం లేకుండా.. ఆయా ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యవారణ ముప్పు ఏర్పడి, నీరు పారక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మునిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే సర్కారు ఎఫ్ టీఎల్ నిర్ధారణకు రంగం రెడీ చేసింది.
అభ్యంతరాలకు గడువు..
ఐదు జిల్లాల పరిధిలో ఇప్పటికే 71 చెరువులకు ఎఫ్ టీఎల్‌ను నిర్ధారించారు. ఈ క్రమంలో వీటిపై అభ్యంతరాలు చెప్పేందుకు నెల రోజుల సమయం ఇచ్చారు. ఎవరైనా.. తమ సొంత స్థలాలను ఈ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా గుర్తిస్తే.. వాటి వివరాలను ఆధారాలతో సహా అధికారులకు అందిస్తే.. ఆయా స్థలాలను ఎఫ్‌టీఎల్ పరిధి నుంచి తప్పించే అవకాశం ఉంది.
2010లోనే ఏర్పాటు..
వాస్తవానికి హైదరాబాద్ పరిధిలో చెరువులు, సరస్సులు, నదులను పరిరక్షించేందుకు 2010లోనే సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలోనే చెరువులు/ సరస్సుల పరిరక్షణ కమిటీ(ఎల్ పీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించాల్సి ఉంటుంది. అయితే.. వివిధ కారణాలతో కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయలేక పోయింది. దీంతో ఆక్రమణలు జోరుగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కారు వస్తూ వస్తూనే హైడ్రాను తీసుకువచ్చి.. ఆక్రమణలు తొలగించే పని ప్రారంభించింది.
బఫర్ జోన్ పరిది ఎంత?
ఏ నదికైనా, చెరువుకైనా.. బఫర్ జోన్(సరిహద్దు ప్రాంతం) నిర్ణయిస్తారు. ఇది 50 మీటర్ల వరకు ఉంటుంది. 2016లో పురపాలకశాఖ ఇచ్చిన జీవో-7 ప్రకారం సరిహద్దులను నిర్ణయించే అధికారం జలవనరుల శాఖకు ఉంటుంది. 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న సరస్సులు, చెరువులు, కుంటల్లో 30 మీటర్ల వరకు బఫర్‌జోన్ ఉంటుంది. ఈ 30 మీటర్లలో కూడా 12 అడుగుల వరకు నడక మార్గం, సైక్లింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేయొచ్చు. ఇలా.. ఆయా చెరువులు సరస్సుల పరిధిని బట్టి బఫర్ జోన్ నిర్ణయిస్తారు.