Begin typing your search above and press return to search.

ప్రపంచంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించిన దేశం భారత్ మాత్రమేనట

ఈ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోడీదేనంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు

By:  Tupaki Desk   |   24 March 2024 4:52 AM GMT
ప్రపంచంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించిన దేశం భారత్ మాత్రమేనట
X

వినేవాడు ఉండాలే కానీ చెప్పేటోడు చెలరేగిపోతాడని ఊరికే అనలేదు. తాజాగా కేంద్ర పెట్రోలియం.. సహజవాయు శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాష్టారి మాటల్ని వింటే ఇదే మాట చప్పున గుర్తుకు వస్తుంది. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడిచిన రెండేళ్లలో ప్రపంచంలో ప్యూయల్ ధరల్ని తగ్గించిన దేశం ఏదైనా ఉందంటే అది భారత్ ఒక్కటి మాత్రమే అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఈ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోడీదేనంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ఆయన మాటల్లోని డొల్లతనాన్ని చెప్పే ముందు.. ఆయన చెప్పుకున్న గొప్పల గురించి చదవాల్సిందే. అప్పుడు మాత్రమే ఆయన జనాల్ని తన మాటలతో ఎంతలా మభ్య పెట్టారన్న విషయం అర్థమవుతుంది. ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ధరల కట్టడిలో మోడీ పాలన అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు పూట్ల రేషన్ బియ్యం అందిస్తూనే మోడీ ఇంధన ధరల్ని తగ్గించారన్నారు. రెండేళ్ల కాలంలో ప్రపంచంలో ఇంధన ధరల్ని తగ్గిన దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందన్నారు.

గడిచిన కొన్నేళ్లుగా పెట్రోల్.. డజిల్.. వంట గ్యాస్ కొరత ఏర్పడిన సందర్భం ఒక్కటి కూడా లేదన్న ఆయన.. 2021, 2022 మే లో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారని.. అందువల్ల పెట్రోల్ ధర రూ.13, డీజిల్ ధర రూ.16 తగ్గిన విషయాన్ని గర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను సైతం తగ్గించాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్.. ధరలు పెరిగిపోతుంటే భారత్ లో మాత్రం ధరలు నియంత్రణలోఉన్నాయన్న ఆయన.. శ్రీలంకలో 60-70 శాతం ధరలు పెరిగినట్లుగా చెప్పారు. పాకిస్థాన్ లో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగాయని.. అమెరికా.. పశ్చిమ యూరప్.. కెనడాలలో 25 శాతంనుంచి 40 శాతం పెరిగినట్లుగా చెప్పారు. భారత్ లో మాత్రం ధరలు తగ్గాయన్నారు.

మంత్రిగారి మాటల్ని పక్కన పెడితే.. ఆయన చెప్పని విషయాల్ని ఇక్కడ ప్రస్తావించాలి. అందులో ముఖ్యమైనది మోడీ తన పదవీ కాలంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎంతలా పెంచేశారో తెలిసిందే. అదెలానంటే.. ఆయన అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే డీజిల్..పెట్రోల్ ధరలు లీటరు సెంచరీని దాటేయటం తెలిసిందే. ఇప్పుడు డీజిల్ ధర సెంచరీకి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. సెంచరీగానే చెప్పేసుకోవాలి. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ మనదేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు.

పెట్రోల్.. డీజిల్ ధరల్ని నియంత్రించేందుకు వీలుగా వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురారు? అన్నది మరో అంశం. రాష్ట్రాలు ఒప్పుకోవన్న మాటను మోడీ సర్కారుచెప్పినా.. వారి హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలకు రాష్ట్రాలు ఒప్పుకోకున్నా పట్టించుకోని మోడీ సర్కారు.. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఎందుకు చేయలేదన్నది ప్రశ్న. ప్రపంచం మొత్తం పెట్రోల్.. డీజిల్ ధరలు తక్కువగా ఉన్న వేళలో నాలుగైదేళ్లకు సరిపడా ముందే పెంచేసిన మోడీ సర్కారు.. ఇప్పుడు ప్రపంచాన్ని పోలుస్తూ ప్రచారం చేసుకోవటం విశేషం. ఒకవేళ ఇప్పుడు ప్రపంచ దేశాల కంటే భారత్ లో తక్కువగా ఉన్నాయనే మంత్రిగారు.. గడిచిన పదేళ్లకు సంబంధించిన ధరల పట్టికను చూపిస్తే ఆయన చేసిన పొగడ్తలకు మోడీ మాష్టారు అర్హుడిగా చెప్పక తప్పదు.