ఎన్నికలు అయితే అలా వదిలేయటమేనా రేవంత్?
అయితే.. అసలు కథ అంతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఉంటుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 22 Dec 2023 4:08 AM GMTఈ మధ్యన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక అంశం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. సాధారణంగా ఎన్నికలు ఏదైనా.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో మాంచి దూకుడును ప్రదర్శిస్తుంది. అందుకు భిన్నమైన వాతావరణం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనిపించిందని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రచార దూకుడు ముందు గులాబీ దళం ఎత్తులు తేలిపోవటమే కాదు.. అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా తాము అనుకున్నట్లుగా టార్గెట్లను రీచ్ అయిపోయారు.
అయితే.. అసలు కథ అంతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఉంటుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని దుమ్ము దులిపిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలను సరైన రీతిలో ప్రచారం చేసి ఉంటే.. మైలేజీ మరింత ఎక్కువగా ఉండేదన్న అభిప్రాం వ్యక్తమవుతోంది.
అయితే.. అందుకు భిన్నంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం నిద్ర పోతున్న పరిస్థితి. గులాబీ దళంలో ఉన్న ఉత్సాహం రేవంత్ ప్రభుత్వంలో మిస్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంతో.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో గులాబీ దళం ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాల ప్రచారం పెద్దగా ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి.
యుద్ధం జరిగే వేళలో పోరాటం మాత్రమే సరిపోదు. అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా వదల కూడదన్న విషయాన్నికాంగ్రెస్ ఎందుకు మిస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. గులాబీ సోషల్ దూకుడుకు కాంగ్రెస్ కళ్లాలు వేయాలని లేకుంటే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. రేవంత్ అండ్ కో ఈ విషయాల్ని గుర్తిస్తున్నారా?