జీ20కు చైనా తీసుకొచ్చిన బ్యాగుల కతేంటి?
జీ20 సమ్మిట్ సందర్భంగా వెలుగు చూసిన ఒక ఉదంతానికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికి తేలకుండా ఉండిపోయింది
By: Tupaki Desk | 14 Sep 2023 4:39 AM GMTజీ20 సమ్మిట్ సందర్భంగా వెలుగు చూసిన ఒక ఉదంతానికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికి తేలకుండా ఉండిపోయింది. ఆ మాటకు వస్తే.. ఎప్పటికి ఆ మిస్టరీ రివీల్ కాదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. జీ20 సదస్సుకు చైనా ప్రతినిధులు హాజరు కావటం తెలిసిందే. భారత్ అతిధులుగా వచ్చిన ప్రతినిధులకు ఢిల్లీలోని ప్రముఖ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. గత గురువారం చైనా టీం హోటల్ కు వచ్చింది. అయితే.. వారు హోటల్ కు వెళ్లే ముందు రెండు బ్యాగులు అసాధారణ కొలతలతో కనిపించాయి.
దీంతో.. రెండు బ్యాగులను ప్రోటోకాల్ ప్రకారం హోటల్ లోపలకు పంపారు. అయితే.. హోటల్ సిబ్బంది మాత్రం ఆ బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాల్ని గుర్తించారు. దీంతో.. ఆ సమాచారాన్ని భద్రతా సిబ్బందికి అందించారు. దీంతో.. ఆ భారీ బ్యాగుల్ని స్కానర్ కింద ఉంచాలని కోరారు. ఇందుకు చైనా ప్రతినిధుల టీం మాత్రం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇష్యూగా మారింది. తమ వెంట తీసుకొచ్చిన బ్యాగులను స్కానర్ కిందకు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేయటం.. దీని పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
దాదాపు పన్నెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం చైనా అధికారులు సదరు బ్యాగుల్ని స్కానర్ కింద కాకుండా.. తమ ఎంబసీకి పంపటానికి అంగీకరించారు. దీంతో.. వివాదం సద్దుమణిగిందన్న మాట వినిపిస్తున్నా.. అసాధారణ కొలతలతో తీసుకొచ్చిన బ్యాగుల్లో ఉన్నవేంటి? వాటిని స్కానర్ల కింద పెట్టటానికి ఎందుకు నో చెప్పారు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించని పరిస్థితి. ఈ వ్యవహారం ఇప్పటికి.. ఎప్పటికి మిస్టరీగా మిగిలిపోతుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.