Begin typing your search above and press return to search.

గచ్చిబౌలిలో 400 ఎకరాల చరిత్రను చెప్పిన సీఎం రేవంత్!

గడిచిన కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించిన వివాదం చర్చకు వస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2025 4:50 AM
గచ్చిబౌలిలో 400 ఎకరాల చరిత్రను చెప్పిన సీఎం రేవంత్!
X

గడిచిన కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించిన వివాదం చర్చకు వస్తోంది. ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిందంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. మరికొందరు.. ఈ భూముల్లో అరుదైన జీవరాశులు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. నిజానికి ఈ నాలుగు వందల ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ను వేలం వేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీలో నాలుగు వందల ఎకరాల గచ్చిబౌలి భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకూ ఈ 400 ఎకరాలు ఎవరివి? వీటిపై యాజమాన్య హక్కులు ఎవరి సొంతం? లాంటి ప్రాథమిక అంశాలతో పాటు.. ఈ భూములపై నెలకొన్న వివాదం వెనుకున్నది ఎవరన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీది కాదన్నారు. ఆ భూమిని దాదాపు పాతికేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఐఎంజీకి కేటాయించిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాడి.. కేసును గెలిచామన్నారు. భూముల్ని స్వాధీనం చేసుకొని టీజీఐఐసీకి కేటాయించామని.. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ కోసం డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ భూముల్లో రక్షిత అటవీ ప్రాంతం ఉన్నట్లు.. జీవరాశులు తిరుగుతున్నట్లు.. చెరువులు..రాళ్లు ఉన్నాయంటూ మాట్లాడుతున్నారన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర సవాలు విసిరారు. ఈ భూములపై వినిపిస్తున్న వాదనల్లో నిజం తేల్చేందుకు ఒక నిజనిర్ధారణ కమిటీ వేద్దామని.. ఎమ్మెల్యేలను తీసుకెళ్లి చూపిద్దామన్నారు. అక్కడ నక్కలు.. పులులు.. సింహాలు లేవని.. ఆ భూముల చుట్టూ గుంటనక్కలు చేరి వివాదాన్ని క్రియేట్ చేస్తున్నాయన్నారు. ఆ గుంట నక్కలకు గునపాఠం చెబుతామన్న సీఎం రేవంత్.. ఆ భూమి 100 శాతం డెవలప్ చెందిన ప్రాంతంలో ఉందని.. హెచ్ సీయూకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు. తాజాగా సీఎం ఇచ్చిన క్లారిటీతో ఈ భూమి ఎవరిన్న దానిపై ఒక స్పష్టత వచ్చినట్లుగా చెప్పక తప్పదు.