గడ్డం బ్రదర్స్ కు మంత్రి పదవి దక్కేనా?
తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తానం ఉన్న దళిత నేతల్లో గడ్డం వెంకటస్వామి ఒకరు. ఆయననే గుడిసెల వెంకటస్వామి అని కూడా అంటారు
By: Tupaki Desk | 14 Dec 2023 4:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తానం ఉన్న దళిత నేతల్లో గడ్డం వెంకటస్వామి ఒకరు. ఆయననే గుడిసెల వెంకటస్వామి అని కూడా అంటారు. దళిత నేతగా, సహృదయుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరు కొడుకులు రాజకీయాల్లోకి దిగారు. వారు వచ్చినప్పటి నుంచి తండ్రికి మరింత కీర్తిని సంపాదించిపెడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గడ్డం బ్రదర్స్ గా గుర్తింపు దక్కించుకున్న వినోద్, వివేక్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లో వినోద్ బెల్లంపల్లి నుంచి విజయం సాధించగా, వివేక్ చెన్నూర్ నుంచి గెలుపొందారు. అయితే, ఇద్దరిలో ఎవరికీ రేవంత్ కేబినెట్ లో మొదటి విడతలో చోటు దక్కలేదు. రెండో విడుతలోనైనా చోట కన్ఫమ్ అవుతుందా? అంటూ మదనపడుతున్నారు.
గడ్డం బ్రదర్స్ లలో వివేక్ బీజేపీలోకి వెళ్లి తిరిగి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ వినోద్ మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉండిపోయారు. తన తల్లిలాంటి పార్టీ అని, ఎప్పటికీ వీడేది లేదని వివేక్ బీజేపీలో చేరిన సమయంలో వినోద్ మీడియాతో చెప్పారు. ఇంతలా పార్టీపై ప్రేమ ఉన్న వినోద్ కు ఈ సారి మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీలో చర్చ మొదలైంది. గడ్డం బ్రదర్స్ లో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. అయితే వీరిని రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ పట్టించుకోలేదు. దీంతో వీరు ఇప్పుడు దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తోనే ఉన్న మాకు న్యాయం చేయాలని అధిష్టాన్ని సైతం కోరుతున్నట్లు వినిపిస్తుంది.
అయితే, వినోద్ మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్, ఆది నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. తన తమ్ముడు పార్టీని వీడిన సందర్భంలో ఆయన వెళ్తారని అంతా అనుకున్నా ఆయన మాత్రం వెళ్లలేదు. మంచైనా, చెడైనా తన మాతృపార్టీతోనే ఉంటానని తెగేసి చెప్పాడు. చాలా సందర్భాల్లో వివేక్ తిరిగి రావాలని కూడా కోరారు. తెలంగాణలో మొదటి సారి ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో వినోద్ కొంచెం అలకగానే ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర నాయకత్వంలో పెద్దగా పరిచయాలు లేకపోవడం, తనకు ఎక్కువ పరిచయాలు ఉన్న నాయకులు సీనియర్లుగా పార్టీలో పెద్దగా కనిపించకపోవడం వినోద్ కు మైనస్ అయ్యిందని తెలుస్తోంది.
రేవంత్ కేబినెట్ ఇంకా పూర్తి స్థాయిలో కొలువుతీరలేదు. రెండో విడుతలోనైనా చోటు దక్కతుందని వారు, వారితో పాటు ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు దళిత నాయకులు ఉన్నారు. అందులో ఒకరు భట్టీ ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. అంతే సమాన ప్రాధాన్యత కలిసిన నేత రాజనర్సింహ కూడా ఉన్నారు. వీరందరినీ దాటి మంత్రి పదవి రావడం కొంచెం కష్టమని టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు వారికి పెద్దగా గుర్తింపు లేదని చెప్పవచ్చు. కేవలం వెంకటస్వామి కొడుకులుగానే గుర్తిస్తున్నారు తప్ప మరెలాంటి గుర్తింపు లేదని వాదనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా రెండో విడుత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశతో ఉన్నారు.