"గద్దర్ అవార్డు".. "గద్దర్ కు అవార్డు".. రెండూ వివాదాస్పదమే!
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది నుంచి ఏటా గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది.
By: Tupaki Desk | 28 Jan 2025 10:18 AM GMTగద్దర్.. తెలుగు నాట అందరికీ తెలిసిన పేరు.. సుఖవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఉద్యమ బాట పట్టి.. తన గొంతుతో.. తన చిందుతో.. లక్షలాది మందిని కదిలించి.. ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచారు గద్దర్.. మావోయిస్టు ఉద్యమంలో కానీ.. తెలంగాణ పోరాటంలో కానీ ఆయనది చెరగని ముద్ర.
సమ సమాజం కోసం పోరుబాటను ఎంచుకున్న గద్దర్ నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి.. తిరిగి జనంలోకి వచ్చారు. దాదాపు 30 ఏళ్ల కిందట పట్టపగలు తనపై జరిగిన కాల్పులు ఓ పెద్ద సంచలనం. అలా శరీరంలో తూటాలతోనే గద్దర్ 25 ఏళ్లకు పైగా బతికారు. 2023 ఆగస్టు 6న చనిపోయారు.
జీవితంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళమెత్తిన గద్దర్.. జీవిత చరమాంకంలో అదే పార్టీకి దగ్గరయ్యారు. ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమయ్యారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గజ్వేల్ నుంచి పోటీ చేసేవారేమో..? కానీ, అనూహ్యంగా అనారోగ్యంపాలై ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు చనిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘గద్దర్’ ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఆయన సొంత జిల్లా మెదక్ లోని పటాన్ చెరులో భారీ విగ్రహం ఏర్పాటు చేసింది. అంతేకాక సినీ పరిశ్రమకు అందించే నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్’ అవార్డులను ప్రవేశపెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తాను స్వయంగా ప్రకటించినా.. గద్దర్ అవార్డుల ప్రతిపాదన పట్ల సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో సీఎం రేవంత్ ఓ దశలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు అనుబంధంగా ఆ తర్వాత పరిణామాలు ఒక్కోటి జరుగుతూ వచ్చాయి. దీంతో పరిశ్రమ అత్యంత చర్చనీయాంశంగా మారింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది నుంచి ఏటా గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. దీనికితగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.ఇటీవల సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పద్మ అవార్డు ఎంతెంత దూరం??
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాము గద్దర్ కు పద్మ అవార్డును ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. ప్రజా కవి గోరటి వెంకన్నకూ అవార్డు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణకు జరిగిన ఈ అవమానంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. వాస్తవానికి గద్దర్ జీవితం అంతా ఉద్యమాలతోనే సాగింది. ఈ క్రమంలో బీజేపీ, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీలను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్ర్తుతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే ఉంది.
అటు కగార్.. ఇటు గద్దర్..
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ను చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులను మట్టుబెడుతోంది. ఇలాంటి సమయంలో జనజీవనంలో కలిసిన మాజీ మావోయిస్టు అయిన గద్దర్ కు పద్మ అవార్డు ఇస్తుందని భావించలేం. కాగా, గద్దర్ నేపథ్యాన్ని నొక్కి చెబుతూ కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ దాదాపు ఇదే తరహా విశ్లేషణ చేశారు. అంటే.. ‘గద్దర్ అవార్డు’.. ‘గద్దర్ కు అవార్డు’ రెండూ వివాదాస్పదం అయ్యాయన్నమాట.