Begin typing your search above and press return to search.

గద్దర్ ఆ పార్టీకే సొంతమా...?

గద్దర్ ఈ నెల 6న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు. దాంతో గద్దర్ ని కాంగ్రెస్ పార్టీ తమ వాడు అంటోంది

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:09 AM GMT
గద్దర్ ఆ పార్టీకే సొంతమా...?
X

గద్దర్ అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఎరుపెక్కిన జెండా. ఆయనది తీవ్ర వాద వామపక్ష భావజాలం. ఆయన అందులోనే తన జీవితం అంతా గడిపారు. ఆయన విప్లవ పంధాకు బూర్జువా పార్టీలతో అసలు పొసగదు. అయితే గద్దర్ చివరి కాలంలో మాత్రం ప్రజాస్వామిక విధానాల మీద ఆసక్తి చూపారు. ఆ విధంగా ఆయన బూర్జువా పార్టీలతో కూడా వేదికలు పంచుకున్నారు.

కానీ ఆయన ఆశయం మాత్రం బడుగు వర్గాల సంక్షేమమే. ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రం కోసం టీయారెస్ కి అప్పట్లో మద్దతు ఇచ్చిన గద్దర్ ఆ తరువాత కాలంలో కేసీయార్ తోనూ విభేదించారు. ఇక ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ఆకర్షితులు అయిన తరువాత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం.

చివరిగా ఆయన ఆయన ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇపుడు అదే కాంగ్రెస్ పార్టీకి వరం అవుతోంది. గద్దర్ ఈ నెల 6న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు. దాంతో గద్దర్ ని కాంగ్రెస్ పార్టీ తమ వాడు అంటోంది. ఆయన చిత్రపటం పెట్టి మరీ తెలనాణాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా మీటింగ్ నిర్వహించారు. గద్దర్ వాయిస్ ని ఈ సభలో వినిపించడం విశేషం.

తాను సత్యం చెబుతున్నానని, తెలంగాణాలో కేసీయర్ సర్కార్ ని గద్దే దించాల్సిందే అంటూ గద్దర్ చెప్పిన మాటలను ఆయన గొంతుకను సభలో వినిపించడం విశేషం. ఇక గద్దర్ కుమారుడు సూర్యానికి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నారు. తన జీవిత పర్యంతం బడుగు బలహీనుల పక్షాన విశేషంగా పోరాడిన గద్దర్ ని కాంగ్రెస్ మనిషిగా చూపించుకునేందుకు ఆ పార్టీ తపన పడుతోంది అని అర్ధం అవుతోంది.

అయితే గద్దర్ చివరి రోజులలో కాంగ్రెస్ పెద్దలతో ఉన్న సందర్భాల వల్ల ఎవరూ ఏమీ ఆక్షేపించే పరిస్థితి కూడా లేదని అనుకోవాలి. ఇక చంద్రబాబు సైతం గద్దర్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనమీ గద్దర్ దీ ఒక పోరాటం అని బాబు ప్రకటించుకోవడం కూడా కొంత విమర్శల పాలు అయింది.

గద్దర్ ని 1997 ప్రాంతంలో ఇంట్లో ఉండగానే తూటాలతో కాల్చిన ఘటన నాటి చంద్రబాబు సర్కార్ కి చుట్టుకుని ఎంతో వివాదాస్పదం అయింది. దానికి ఇన్నేళ్ళ తరువాత చంద్రబాబు సైతం వివరణ ఇచ్చారు. ఆ ఘటనతో అప్పటి తమ ప్రభుత్వానికి సంబంధం లేదని గద్దర్ దీ తనది పేదల కోసం సాగే ఉద్యమ బాట అని అనేశారు.

ఇక బీజేపీ నేతలు కూడా గద్దర్ తమ వాడుగా చేసుకునేందుకు తాపత్రయపడ్డారు అని అంటారు. గద్దర్ సతీమణికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాసి సానుభూతి వ్యక్తం చేశారు. అయితే గద్దర్ సిద్ధాంతాలు ఇపుడు ఉన్న ఏ రాజకీయ పార్టీకి సరిపోనివే. ఆయన ఆసాంతం ఏడున్నర దశాబ్దాలుగా నల్ల దొరల పాలన మీదనే పోరాడారు. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్తీ అన్న తేడా లేదు, ఆ జెండా ఈ జెండా అన్న చర్చ అంతకంటే లేదు. ఏది ఏమైనా ఉన్నంతలో కాంగ్రెస్ బెటర్ అని గద్దర్ చివరి రోజులలో భావించారో ఏమో ఆ పార్టీకి బాగా సన్నిహితులు అయ్యారు.

ఇక కాంగ్రెస్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండడం, ఆ పార్టీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావడం ఇవన్నీ చూస్తూంటే దేశానికి మళ్లీ కాంగ్రెస్ అవసరం ఉందని ప్రగతి శీల శక్తులు కూడా భావిస్తున్నాయేమో కానీ గద్దర్ విషయం తీసుకుంటే ఆయన బతికి ఉంటే కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చి ఉండేవారు అని ఖద్దర్ నేతలు అంటారు. అందుకే ఆయనను తమ సొంతంగా చేసుకుంటున్నాయి. గద్దర్ ఖద్దర్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడతారు అన్నది రానున్న కాలంలో ఎన్నికల ఫలితాలే నిరూపిస్తాయి.