గద్దర్ అంతిమ యాత్రలో తీవ్ర విషాదం.. ఎడిటర్ కన్నుమూత
ఆదివారం మధ్యాహ్నం మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ భౌతిక కాయానికి ఈ రోజు అంత్యిక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 7 Aug 2023 5:00 PM GMTఆదివారం మధ్యాహ్నం మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ భౌతిక కాయానికి ఈ రోజు అంత్యిక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచి.. ఈ రోజు మధ్యాహ్నం.. అల్వాల్‌లోని ఆయన స్వగృహా నికి పార్థివ దేహాన్ని కొద్ది సేపు ఉంచి.. అనంతరం యాత్రగా బోధి విద్యాలయానికి తరలించారు. అయితే..ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గద్దర్ కు మిత్రుడు, ఉర్దూ పత్రిక సియాసత్ ఎడిటర్ తోపులాటలో చిక్కుకుని గుండెపోటుకు గురై మృతి చెందారు.
`సియాసత్` పత్రిక ఎడిటర్‌గా జహీరుద్దీన్ అలీ ఖాన్ కు గద్దర్‌తో కొన్ని దశాబ్దాలుగా స్నేహ బంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివా రం ఉదయం నుంచి కూడా ఎడిటర్ గద్దర్ చికిత్స పొందిన ఆసుపత్రి.. అనంతరం ఎల్బీ స్టేడియంల వద్దే ఉన్నారు. ఈ రోజు కూడా అంతిమ యాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతిమ యాత్రకు సంబంధించి కొన్ని పనులను కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. మిత్రుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు.. ఆయన అంతిమ యాత్రలో తరలి వెళ్లారు. అయితే.. వయోసంబంధ సమస్యలు, షుగర్, బీపీ వంటివి ఉన్నప్పటికీ.. ఆయన పట్టించుకోలేదు.
ఇదిలావుంటే.. అంత్యక్రియలకు నిర్ణయించిన బోధి విద్యాలయం ప్రాంతం చిన్నది కావడం, ప్రజాగాయకుడికి నివాళులర్పిం చేందుకు పెద్ద ఎత్తున అభిమాన గణం తోసుకురావడంతో తీవ్ర తోపులాట జరిగింది. అప్పటికీ పోలీసులు.. లాఠీ చార్జీ చేసినా.. పరిస్థితి సర్దుమణగలేదు. ఈ నేపథ్యంలో సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కింద పడిపోయారు. వెనువెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించేపరిస్థితి కూడా లేకపోయిందని పలువురు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుకు గురై.. ప్రాణాలు కోల్పోయారు.