గద్దర్ అంత్యక్రియల్లో భారీ జనం... ఇంటెలిజెన్స్ సమాచారంతో నిఘా?
గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో వేలాదిమంది అంతిమయాత్రలో పాల్గొంటున్నారు
By: Tupaki Desk | 7 Aug 2023 11:14 AM GMTప్రజా యుద్దనౌక గద్దర్ (74) అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో.. వేలాదిమందిగా అభిమానులు, బంధువులు, ఉద్యమకారులు, గాయకులు, నాయకులు, యువత తరలివెళ్తున్నారు. ఆయన్ని కడసారి చూసి పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అవును... గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో.. వేలాదిమంది అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా... గద్దర్ అంతిమయాత్రపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఈ విషయంలో పోలీసులు భారీ స్థాయిలో నిఘా పెట్టడానికి కొన్ని కారణాలు తెరపైకి వస్తున్నాయి.
గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతిమయాత్రపై పోలీసులు నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ఇందుకోసం సీసీ కెమెరా మౌంటెడ్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.
అయితే... గద్దర్ తో ఉద్యమంలో కలిసి పనిచేసిన చాలామందిపై కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది జైలుకు వెళ్లి రాగా.. మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఆయనను కడసారి చూసేందుకు అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారని తెలుస్తోంది.
సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనున్న అంతిమయాత్ర సందర్భంగా వచ్చే వ్యక్తుల కదలికలను గమనిస్తున్నారు పోలీసులు. ఇక మఫ్టీలో ఉన్న పోలీసులు సైతం గద్దర్ అంతిమయాత్ర సాధారణ జనంతో కలియ తిరుగుతూ.. నక్సలైట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
కాగా.. 1949 జూన్ 5న జన్మించిన గద్దర్.. మెదక్ జిల్లా హన్మాజీపేట స్వగ్రామం కాగా నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు.
ఈ నేపథ్యంలో... గత నెల 20న గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు గద్దర్. ఈ సమయంలో గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన డాక్టర్లు.. ఈనెల 3న సర్జరీ చేశారు. అంతకుముందు నుంచే మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా గద్దర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆదివారం రోజున తుదిశ్వాస విడిచారు.
గద్దర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ గేయ రచయితలు, కళాకారులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని స్మరించుకుంటున్నారు.