Begin typing your search above and press return to search.

నింగికెగసిన ప్రజా యుద్ధ నౌక 'గద్దర్'

తన గళంతో ఉర్రూతలూగించి.. తన పాదంతో కదం తొక్కి.. చేతిలో తుపాకీ పట్టి ఓ తరాన్ని ప్రభావితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచారు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 10:33 AM GMT
నింగికెగసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్
X

తన గళంతో ఉర్రూతలూగించి.. తన పాదంతో కదం తొక్కి.. చేతిలో తుపాకీ పట్టి ఓ తరాన్ని ప్రభావితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల కిందట ఆస్ప్రతిలో చేరి.. ‘‘నా గుండెకు గాయమైందంటూ’’ ప్రకటన చేసిన గద్దర్ గళం మూగబోయింది. ‘‘బండెనక బండి కట్టి..’’ ‘‘భద్రం కొడుకో నా కొడుకొ కొమురన్న జర’’ అంటూ పాడిన గద్దరన్న స్వర్గానికి వెళ్లిపోయారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..? పోరు తెలంగాణమా? అంటూ తెలంగాణ మలి దశ ఉద్యమంలో గర్జించిన గద్దరన్న మనల్ని వీడి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు.

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్. గద్దర్ ఆయన పాట పేరు. మెదక్ జిల్లా తూప్రాన్ లో జన్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో ఆయనపై జరిగిన కాల్పులు పెద్ద సంచలనం. ‘‘పాటపై పేలిన తూటా’’గా ఇది చాలా కాలం జనం నోళ్లలో నానింది. అప్పటినుంచి గద్దర్ శరీరంలో తూటాలు అలానే ఉన్నాయి. అయినా అలుపెరగని గద్దర్ ప్రజల్లో ఉంటూనే ఉన్నారు. ఆఖరుకు మండుటెండలోనూ ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపటిట ‘పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. "మా భూములు మాకే" అనే నినాదం ఇచ్చారు.

కాగా.. గుండెలో ఇబ్బంది ఉండంతో గద్దర్ బేగంపేట శ్యామ కరణ్ రోడ్ లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో జూలై 20న చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి గతంలో గద్దర్ గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు 74 ఏళ్ల వయసుకు వచ్చారు. కానీ, ఓవైపు ఒంట్లో తూటా.. మరోవైపు వయోభారం.. ఇంకోవైపు గతంలో జరిగిన శస్త్రచికిత్సల తాలూకు జాగ్రత్తలు పాటిస్తూనే గద్దర్ జనంలో ఉండసాగారు.

ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ లో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు గద్దర్ నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లలో చదివారు. ఇంజనీరింగ్ చేసిన ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఉద్యమ భావజాల వ్యాప్తికి బుర్ర కథను ఎంచుకున్నారు. గద్దర్ ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి.నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ ప్రదర్శనలు సాగాయి. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశారు. ఆయన మొదటి ఆల్బమ్ పేరు గద్దర్. ఇదే పేరు తర్వాత స్థిరపడింది.

నక్సలిజంతో పాటే సామాజిక చైతన్యంలోనూ

గద్దర్ అంటే వామపక్ష ఉద్యమ భావజాలం. కానీ, ఆయన కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాలపై బుర్రకథలను రూపొందించి ప్రదర్శించారు. వాటిద్వారా ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత అనేక పాటలు కూడా రాశారు. ఇదంతా గద్దర్ యువకుడిగా ఉన్నప్పుడు. కాగా, 1972 లో జన నాట్య మండలి ఏర్పడగా.. పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొలిపేందుకు దానిని వేదికగా చేసుకున్నారు. 1975లో గద్దర్ కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరారు. ఆయనకు భార్య పేరు విమల, ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. వీరిలో ఓ కుమారుడు 20 ఏళ్ల కిందట చనిపోయాడు.

బండెనక బండి కట్టి అంటూ

గద్దర్ పాడిన వాటిలో బండెనక బండి కట్టి అనే పాట హైలైట్. దానిని రాసింది బండి యాదగిరి అయినా.. పాడిన గద్దర్ కూ అదే స్థాయిలో పేరొచ్చింది. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటిస్తూ యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. కాగా, 1984 లో గద్దర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.1985 లో కారంచేడులో దళితుల హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో ఒగ్గు, బుర్ర, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్ లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లుగా, సీడీగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.

మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్ల పట్ల ఉదారంగా వ్యవహరించారు. వారిపై నిషేధం ఎత్తి వేశారు. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

1997 ఏప్రిల్ 6 న గద్దర్ పై కాల్పులు జరిగాయి. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు దిగాయి. ఒక్క బుల్లెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. కాగా, 2004లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్లు గద్దర్, వరవర రావులను దూతలుగా పంపారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ

గద్దర్ మొదటినుంచి తెలంగాణవాదే. మలి దశ ఉద్యమంలోనూ గద్దర్ ది కీలక పాత్ర. వెనుకబడిన, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు.