గాజువాక తీర్పు : స్టీల్ ప్లాంట్ బండ ఎవరి నెత్తిన ..?
విశాఖ జిల్లాలో గాజువాక అసెంబ్లీ సీటు ఇపుడు రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు
By: Tupaki Desk | 18 April 2024 4:03 AM GMTవిశాఖ జిల్లాలో గాజువాక అసెంబ్లీ సీటు ఇపుడు రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు. కానీ టీడీపీ కూటమిలో ఉంది. బీజేపీ మూడేళ్ళ క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలని డెసిషన్ తీసుకుంది. మరోసారి కనుక కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే మొదటి వేటు పడేది విశాఖ స్టీల్ ప్లాంట్ కే అన్న సంగతి అందరికీ ఎరుకే.
దాంతో గత మూడేళ్ళుగా ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమకారులు బీజేపీ తీరు మీద మండిపోతున్నారు. అయితే బీజేపీ మీద తమ కోపం చూపించాలీ అంటే ఆ పార్టీ గాజువాక ఎలక్షన్ సీన్ లో లేదు. అంతే కాదు విశాఖ ఎంపీ బరిలోనూ లేదు. కానీ బీజేపీ ఉన్న కూటమి నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. టీడీపీని ఈ విషయంలో ఆగ్రహించి ఉక్కు కార్మికులు చెక్ పెడతారా అంటే అది ఆలోచించాల్సిందే అంటున్నారు.
టీడీపీకి గాజువాకలో మంచి పట్టు ఉంది. జనసేన సపోర్టు ఉంది. కార్మిక వర్గం నుంచి అండదండలు ఉన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఆయన అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టంగా చెబుతున్నారు. గాజువాకకు ఇటీవల వచ్చిన చంద్రబాబు కూడా అదే చెప్పుకొచ్చారు. అలా ఉక్కు కార్మికుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం వారు చేశారు.
తమ తప్పు ఏదీ లేదని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే తాము ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకించామని ఏకంగా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు వేదిక మీదనే జనమందరి ముందు ఈ విషయం చెప్పారని గుర్తు చేస్తున్నారు
వైసీపీ తరఫున మంత్రి గుడివాడ అమర్నాధ్ పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ బీజేపీ కూటమిగా వస్తున్నాయని ఈ విషయంలో టీడీపీని నిలదీయమని ఉక్కు కార్మికులను కోరుతున్నారు. మరో వైపు చూస్తే రెండు పార్టీల వాదనలో సబబు ఉంది. బీజేపీ దోషిగా ఉంది. కానీ ఆ పార్టీ మీద నేరుగా కోపం తీర్చుకోవడానికి లేదు. పోటీలో లేకపోవడమే అందుకు కారణం.
ఈ నేపధ్యంలో ఉక్కు పోరాటాలు చేసిన ఉద్యమ నేత జగ్గునాయుడుని సీపీఎం తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనకే ఓటు వేయాలని కోరుతోంది. సహజంగా ఉక్కు కార్మికులు ఎక్కువ శాతం ఆయనకు ఓటు వేసేలా కనిపిస్తోంది. అంటే ఉక్కు వ్యతిరేక ఓటు కాస్తా సీపీఏం కి అనుకూల ఓటు అవుతుందన్న మాట. అంతమాత్రం చేత సీపీఎం అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకూ అంటే అది చెప్పలేని పరిస్థితి.
అయితే ఆ ఓట్లు ఎంత మేరకు సీపీఎం కి పోతాయన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. అవి కాస్తా వేలల్లో టర్న్ అయితే మాత్రం కచ్చితంగా ప్రధాన పార్టీల విజయావకాశాల మీద ప్రభావం చూపిస్తుంది. అపుడు దెబ్బ పడేది టీడీపీకా లేక వైసీపీకా అన్న చర్చ వస్తోంది. ఈ రెండు పార్టీలు ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ఉక్కు పాపం మాది కాదు అంటూ చెప్పుకుంటున్నా ఉక్కు దెబ్బ మాత్రం కచ్చితంగా పడుతుందని కలవరపడుతున్నాయి. మరి ఉక్కు బండ ఎవరి నెత్తిన అంటే జవాబు కోసం జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.