రోజాకు జగన్ మార్క్ షాక్...గాలి తనయుడు వైసీపీలోకి !
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం.
By: Tupaki Desk | 10 Feb 2025 9:09 AM GMTచిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. జగనన్నా అంటూ ఆమె ఫైర్ బ్రాండ్ గా వైసీపీలో రాజకీయాలు చేశారు. వైసీపీ తరఫున మూడు సార్లు ఆమెకు టికెట్ ని పార్టీ ఇస్తే రెండు సార్లు గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓటమికి చవిచూశారు.
ఇదిలా ఉండగా ఓటమి తరువాత ఆమె నగరికి దూరంగా ఉంటున్నారు అన్న విమర్శలు పార్టీ క్యాడర్ నుంచి ఉన్నాయి. అంతే కాదు ఆమెకు మంత్రి పదవి ఇచ్చినా పార్టీని పటిష్టం చేసుకోలేకపోవడంతో పాటు నియోజకవర్గంలో వర్గ పోరుని పెంచడం వల్ల కూడా ఆమెకు 2024 లో తీవ్ర నష్టం వాటిల్లింది అని అంటున్నారు.
ఇక పార్టీ ఓటమి తరువాత ఆమె అపుడపుడు మీడియా ముందుకు వస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కానీ అదే సమయంలో ఆమె నియోజకవర్గం మీద పెద్దగా ఫొకస్ పెట్టడం లేదు అన్న ఆలోచనతోనే అధినాయకత్వం ఆమె ప్లేస్ లో వేరొకరిని తెచ్చి రీప్లేస్ చేయడానికి సిద్ధపడుతోంది అని అంటున్నారు.
నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి దివంగత నేత టీడీపీకి చెందిన గాలి ముద్దు క్రిష్ణమనాయుడుకు మంచి పలుకుబడి ఉంది. ఆయన మరణానంతరం కుమారులు ఇద్దరూ రాజకీయ వారసత్వం కోసం పేచీలు పడ్డారు. అయితే మొదట్లో గాలి సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి సర్దుబాటు చేసిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ కి టికెట్ ఇచ్చారు.
అయితే తనకు టికెట్ కావాలని పట్టుబట్టిన గాలి జగదీష్ ఏకంగా అన్న మీదనే పోటీకి సిద్ధమని ఒక దశలో ప్రకటించారు. అయితే ఎన్నికల వేళ ఎలాగోలా సర్దిచెప్పుకొని ఆయనను ఉంచారు. కానీ ఎన్నికల అనంతరం ఆయన ఇపుడు సొంత సోదరుడు ఎమ్మెల్యేనే విభేదిస్తూ వస్తున్నారు.
ఈ పరిణామాలతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. తనకు 2029 ఎన్నికల్లో వైసీపీ నగరి టికెట్ ఇస్తే కనుక తాను పార్టీలో చేరుతాను అని కండిషన్ జగదీష్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దానికి వైసీపీ అధినాయకత్వం అంగీకరించడంతో ఆయన ఈ నెల 12న తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది.
గాలి కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టుతో పాటు జగదీష్ సొంత మామ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, ఆయన మద్దతు కూడా కలసి వస్తుందని భావిస్తున్నారు. నగరిలో వైసీపీకి ఈ విధంగా బలమైన రాజకీయం ఏర్పాడుతుందని లెక్క వేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే నగరిలో జగదీష్ కి టికెట్ ఇస్తే అపుడు రోజా పరిస్థితి ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అయితే ఆమె సేవలను పార్టీ కోసం ఉపయోగించుకుంటారని పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెకు వేరే విధంగా న్యాయం చేస్తారని చెబుతున్నారు. మరి దీనికి ఆమె ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది చూడాలి. ఒక వేళ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా ఆగ్రహించి అలిగితే ఆమె ఏమి చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి నగరిలో రోజాకు భారీ షాక్ తగలబోతోంది అన్నది కన్ ఫర్మ్ అంటున్నారు.