గాలి జనార్ధన్ రెడ్డి..జగన్ రమ్మంటే..బాబు పొమ్మన్నారు!?
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By: Tupaki Desk | 4 Sep 2024 6:08 PM GMTకర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి 4 ఏళ్లపాటు జైలు శిక్ష కూడా జనార్ధన్ రెడ్డి అనుభవించారు. ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గాలి జనార్దన్ రెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు గాలి జనార్దన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రయత్నాలకు చంద్రబాబు సర్కార్ చెక్ పెట్టింది.
ఏపీలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ మైనింగ్ ప్రారంభించుకోవచ్చంటూ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలు సాగించేందుకు అభ్యంతరం లేదంటూ జగన్ సర్కార్ ఇచ్చిన అనుమతులను పరిశీలించాలని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. గత ప్రభుత్వం ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను పరిశీలించాలని చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను చెరిపివేసేలాగా అక్రమంగా ఇనుమును తవ్వేసి గాలి జనార్దన్ రెడ్డి భారీగా లాభాలు పొందారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారంలో కేసు నమోదు చేసిన సీబీఐ గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఆయన చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఆ కేసు విచారణలో ఉండగానే గత జగన్ ప్రభుత్వం ఏపీలో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ చేసుకునేందుకు అనుమతినివ్వడంతో తాజాగా ఆ అనుమతిని పరిశీలించాల్సి ఉందని చంద్రబాబు సర్కార్ చెప్పడంతో గాలి జనార్దన్ కు షాక్ తగిలినట్టు అయింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.