గాలివీడు ఎపిసోడ్ లో ఏం చేద్దాం? వైసీపీ ఢిఫెన్సు పడిందా?
ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో తీరు ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే.. ఏయే అంశాలకు ఎలా రియాక్టు అవుతుందన్న విషయాన్ని చెప్పేలా వ్యవహరిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 30 Dec 2024 4:31 AM GMTఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో తీరు ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే.. ఏయే అంశాలకు ఎలా రియాక్టు అవుతుందన్న విషయాన్ని చెప్పేలా వ్యవహరిస్తూ ఉంటారు. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎలాంటి కనికరం ప్రదర్శించని తత్త్వం వైసీపీ సొంతంగా చెప్పాలి. అంతేకాదు.. దాడికి ఎదురుదాడే సమాధానంగా భావించటమే కాదు.. కింద పడ్డా పైచేయి తమదేనన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. ఏదైనా అంశంలో తమది తప్పని తేలినప్పటికి.. అడ్డదిడ్డంగా వాదనలు వినిపిస్తూ..తమదే రైట్ అన్నట్లుగా బిహేవ్ చేసే తీరు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది.
దూకుడుతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైసీపీ తొలిసారి ఒక అంశంలో ఆత్మరక్షణలో పడిందా? ఏం చేయాలన్న దానిపై అంతర్మధనానికి గురవుతుందా? అంటే .. అవునన్న మాట వినిపిస్తోంది. ఏపీలో పెను సంచనలంగా మారి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ పొలిటికల్ గ్రాఫ్ ను మరింత పెంచేలా చేసిన గాలివీడు ఎంపీడీవోపై జరిగిన దాడి విషయంలో ఎలా స్పందించాలన్న దానిపై వైసీపీ అధినాయకత్వం తీవ్రమైన అంతర్మధనానికి గురైనట్లుగా తెలుస్తోంది.
దాడికి గురైన ఎంపీడీవో దళితుడు కావటం.. ఈ విషయంలో అవసరానికి మించి.. అతిని ప్రదర్శించిన పార్టీ సానుభూతిపరుల విషయంలో ఏమేరకు జోక్యం చేసుకోవాలన్న దానిపై సందిగ్థంలో పడినట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గా చెప్పాలి. మామూలుగా అయితే.. ఈ ఇష్యూను పవన్ కాకుండా మరెవరు టేకప్ చేసినా.. ఇష్యూ మరో దారికి మళ్లేలా చేయటం కాని.. ఘాటైన కౌంటర్ ఇచ్చేలా వైసీపీ ముఖ్యనేతలు వ్యవహరించేవారు. కానీ.. పవన్ ఎంట్రీ ఇవ్వటం.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో.. జరిగిన విషయాన్ని జరిగినట్లుగా ప్రజలకు తెలిసేలా చేసిన పవన్ కల్యాణ్.. తప్పు చేసిన వారి విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న సందేశాన్ని అందరికి తెలిసేలా చేశారు.
అక్కడితో ఆగని పవన్.. ఘటన జరిగిన ఉమ్మడి కడప జిల్లాకు చేరుకొని.. తాను ఒక ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉంటానన్న సందేశాన్ని ఇచ్చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే.. ఏపీ రాజకీయాల్లో అంతులేని వేగాన్ని ప్రదర్శించే వైసీపీ వర్గానికి పవన్ తీరు స్పీడ్ బ్రేకర్ గా మారిందంటున్నారు. ఇప్పుడు అసలు విషయం మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత.. ఏ మాత్రం కవర్ చేసినా.. తమ పార్టీ నేతల విషయంలో వ్యతిరేక వాదనను వినిపించిన పక్షంలో ప్రజల్లో పలుచన అయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించిన వైసీపీ నేతలు ఇప్పుడు కామ్ గా ఉండటానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఇదేనన్న మాట వినిపిస్తోంది.