ఇది గల్లా ‘పవర్’ రాజకీయాల్లో లేనంటూనే...
గల్లా జయదేవ్.. గుంటూరు మిర్చిలా ఈ పేరుకు చాలా సౌండ్ ఎక్కువ. అమరరాజా ఇండస్ట్రీస్ యజమాని అయిన గల్లా జయదేవ్ గుంటూరు మాజీ ఎంపీ. పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన ఏకైక ఎంపీ.
By: Tupaki Desk | 26 Feb 2025 10:29 AM GMTగల్లా జయదేవ్.. గుంటూరు మిర్చిలా ఈ పేరుకు చాలా సౌండ్ ఎక్కువ. అమరరాజా ఇండస్ట్రీస్ యజమాని అయిన గల్లా జయదేవ్ గుంటూరు మాజీ ఎంపీ. పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన ఏకైక ఎంపీ. అప్పట్లో ఆయన గట్స్ చూసి దేశమొత్తం విస్తుపోయింది. మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ అయిన ప్రధాని మోదీని అలా సంభోదించే డేరింగ్ అండ్ డేషింగ్ అంటూ విపక్షాలు పొగడ్తలతో ముంచెత్తారు.
అలాంటి సత్తా ఉన్న లీడర్ గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో తన పరిశ్రమలను మూసివేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. అంతేకాకుండా రాజకీయాలను వదిలేస్తున్నానని ప్రకటించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూటమి ప్రభుత్వంలో తన ‘పవర్’ చూపుతున్నారు.
రాజకీయాల నుంచి వైదొలుగుతున్న ప్రకటించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నట్లు కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా, తన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా.. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పొలిటీషన్స్ ను ఆహ్వానించి మంచి విందు ఇచ్చి వీడ్కోలు సభకు వైభవంగా నిర్వహించారు.
ఇలా రాజకీయాల నుంచి వైదొలుగుతూ భారీ కార్యక్రమం నిర్వహించడం గల్ల జయదేవ్ స్పెషాలిటీ. చాలా మంది నాయకులు రిటైర్మెంట్ ప్రకటనలు కేవలం పత్రికల్లో వస్తాయి. లేదా ప్రజల తిరస్కారంతో వారే సైలెంట్ అయిపోతుంటారు. కానీ, గల్లా జయదేవ్ అలా కాదు వైసీపీ హవాలోనూ ఆయన గుంటూరు ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో గట్టిగా తన వాణి వినిపించారు. కానీ, రాష్ట్రంలో తన ఇండస్ట్రీస్ కాపాడుకోడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలకు వీడ్కోలు పలికారని అంటున్నారు.
అయితే ఈ మధ్య మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వంలో తన సహచరుడు కింజరాపు రామ్మోహనరావు మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు గల్లా జయదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్మోహనాయుడి కుటుంబ సభ్యులతోనే ఆయన కనిపించారు. ఇక జనవరిలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలోనూ జయదేవ్ మెరిసారు. పారిశ్రామిక వేత్తగా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ తదితరులతో భేటీ అయి తన పొలిటికల్ ఇంట్రస్ట్ వ్యక్తీకరించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ కంపెనీ అమరరాజా ఇన్ ఫ్రా భారీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. సత్యసాయి జిల్లా రామగిరి వద్ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టు దక్కింది. 11 వందల ఎకరాల్లో 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్ నిర్మించాలని సెకీ భావిస్తోంది. ఏడాదిలోగా పూర్తి చేసే లక్ష్యంతో గల్లా జయదేవ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించారని అంటున్నారు. తన చేతిలో పవర్ లేకపోయినా తన ‘పవర్’ ఏంటో చూపించిన జయదేవ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక గతంలో ఆయన చెప్పినట్లు త్వరలోనే రాజకీయాల్లోకి పునఃప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.