రాజ్యసభకు గల్లా జయదేవ్...ఖరారు చేసిన బాబు!?
ఇటీవల వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
By: Tupaki Desk | 10 Sep 2024 3:59 PM GMTప్రముఖ పారిశ్రామికవేత్త, రెండు సార్లు గుంటూరు నుంచి లోక్ సభకు టీడీపీ తరఫున గెలిచిన గల్లా జయదేవ్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని అంటున్నారు. గల్లా జయదేవ్ పేరుని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు అని అంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
ఆ విధంగా ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. వాటికి తొందరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమికే పూర్తి మెజారిటీ ఉంది. దాంతో ఈ రెండు సీట్లూ టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ నేపథ్యంలో అందులో ఒక సీటుకు గల్లా జయదేవ్ పేరుని చంద్రబాబు ఖరారు చేశారు అని అంటున్నారు.
అమర్ రాజా ఎనెర్జీ అండు మొబిలిటీ లిమిటెడ్ సంస్థకు చైర్ పర్సన్ గా ఉన్న గల్లా జయదేవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాలకు స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. తన కుటుంబం, వ్యాపారాలు చూసుకుంటానని ఆనాడు ఆయన చెప్పారు. అయితే టీడీపీ కూటమి ఏపీలో బంపర్ మెజారిటీతో విజయం సాధించడం, అదే సమయంలో కేంద్రంలో బీజేపీ టీడీపీ మద్దతుతో ఏర్పాటు కావడంతో గల్లా జయదేవ్ తన మనసు మార్చుకున్నారు అని అంటున్నారు.
ఆయన తిరిగి రాజకీయాలలో చురుకుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం సాగింది. ఆయన రెండు సార్లు ఎంపీగా పని చేయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరితో ఉన్న పరిచయాలకు దృష్టిలో ఉంచుకుని ఆయనను ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారు అని మొదట ప్రచారం సాగింది. అయితే ఆయన అనుభవాన్ని పెద్దల సభలో వినియోగించుకోవాలని భావించి ఇపుడు గల్లాను రాజ్యసభకు పంపించాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఇక గల్లా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుంటూరు లోక్ సభ సీటులో ఎన్నారై అపర కుబేరుడు అయిన పెమ్మసాని చంద్రశేఖర్ తో బాబు భర్తీ చేశారు. ఆయనకు ఎంపీ సీటు ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిచారు. అంతే కాదు కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అదే గల్లా పోటీ చేసి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారు అని అంతా అనుకున్నారు.
ఇక పెమ్మసాని గుంటూరు వాసి కావడంతో పాటు అక్కడ రాజకీయంగా పాతుకుపోయేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దాంతో గల్లాకు లోక్ సభ సీటు ఎక్కడ అన్నది ఒక ప్రశ్నగా ఉంది. దాంతో ఆయనను రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే బాబు ఆలోచన అని చెబుతున్నారు.
ఇక గల్లా జయదేవ్ ని మోపిదేవి వెంకట రమణ సీటులో రీప్లేస్ చేస్తారు అని అంటున్నారు. 2026 వరకూ ఈ ఎంపీ సీటు పదవి కాలం ఉంది. మరో వైపు వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావును అదే సీటు ఇస్తూ కొనసాగిస్తారు అని అంటున్నారు. అంటే ఒక బీసీకి ఒక ఓసీకి ఈ రెండు సీట్లు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం తో పాటు అనుభవానికి కూడా పెద్ద పీట వేసినట్లు అవుతుందని బాబు లెక్క వేస్తున్నారు అని అంటున్నారు.
ఇక గల్లా జయదేవ్ ని రాజ్యసభకు పంపడం ద్వారా పెద్దల సభలో బీజేపీ అవసరాలను తీర్చడం అదే సమయంలో వైసీపీకి ఈ రోజుకీ ఉన్న 9 మంది ఎంపీల మద్దతు బీజేపీకి దక్కకుండా చూడడం అన్న లక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పని ఎంతో అనుభవంతో పాటు బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్న గల్లా చేయగలరని బాబు నమ్ముతున్నారు అని అంటున్నారు. మొత్తానికి గల్లా రెండు సార్లు లోక్ సభ నుంచి ఎంపీ అయ్యారు. ఈసారి పెద్దల సభలో కనిపించబోతున్నారు అన్న మాట. దటీజ్ మ్యాటర్.