దేశంలో వ్యాపారవేత్తలు రాజకీయాలు చేయలేని పరిస్థితి: గల్లా
''దేశంలో వ్యాపార వేత్తలు రాజకీయాలు చేసుకునే పరిస్థితి దాదాపు కనిపించడం లేదు. ఏం మాట్లాడినా ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడాలి
By: Tupaki Desk | 5 Feb 2024 5:15 PM GMT''దేశంలో వ్యాపార వేత్తలు రాజకీయాలు చేసుకునే పరిస్థితి దాదాపు కనిపించడం లేదు. ఏం మాట్లాడినా ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడాలి. వారు చేసిన చెడు పనులకు సైతం తలూపాలి. ఏ చిన్న ప్రశ్న అడిగినా.. అదివారికి ఇబ్బంది అనిపిస్తే.. నాయకులను టార్గెట్ చేయడం మానేసి..వ్యాపారాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి నా ఒక్కడికే కాదు. దేశంలో రాజకీయాల్లో ఉన్న 20 శాతం మంది ప్రముఖ ఇండస్ట్రియలిస్టులది'' అని టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆయన లోక్‌సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు వేదికగా.. తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు తెలిపారు. అయితే.. రాముడు 14 ఏళ్లువనవాసం చేసి తిరిగి వచ్చినట్టుగా తాను కూడా..కొన్నాళ్ల తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వస్తానని.. అప్పటి వరకుతన వ్యాపారాలపైనే దృష్టి పెడతానని సభ్యులకు చెప్పారు. అయితే.. తిరిగి వచ్చేప్పుడు చాలా శక్తి పుంజుకుని వస్తానన్నారు. ఇక, దేశంలో వ్యాపార వేత్తలకు ఉన్న ఇబ్బందులను ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. ఉద్దేశ పూర్వకంగా కంపెనీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తమకు అనుకూలంగా ఉంటే ఏమీ జరగదని వ్యాఖ్యానించారు.
''ప్రజల కోసం నేతలుగా ఎన్నుకోబడిన నాయకులు.. సభలో ఏదైనా ప్రశ్నించాల్సి వస్తే.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకో వాల్సిన పరిస్థితి ఉంది. దానిలో నిజాయితీ ఉన్నప్పటికీ.. అడిగేందుకు జంకుతున్నారు. దీనికి కారణం వ్యాపారాలు ఉండడమే. ఏం అడిగితే.. ఎలాంటి దాడి ఏ రూపంలో వస్తుందోననే బెంగ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్న 20 శాతం మంది వ్యాపారులకు ఉంది. ఈ పరిస్థితి నాకు కూడా ఎదురైంది. ప్రభుత్వ దాడులను సమర్థంగా ఎదుర్కొనలేని వ్యాపారులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. కొన్ని కొన్ని కంపెనీలు నేడు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. దీనికి కారణం రాజకీయాలు-వ్యాపారాలను సమ ఉజ్జీలుగా నడపలేక పోవడం, రాజీ పడలేక పోవడమే. అందుకే నేను కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా'' అని జయదేవ్ అన్నారు.
ప్రపంచ దేశాలకు మనకు చాలా తేడా ఉందని గల్లా తెలిపారు. ప్రపంచ దేశాల్లో వ్యాపార వేత్తలను రాజకీయాల్లో నేతలు ప్రోత్సహి స్తున్నారని తెలిపారు. ఇలానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అక్కడ వారు చేసే విమర్శలను రాజకీయంగానే చూస్తారు తప్ప.. వ్యాపారాల కోణంలో చూడబోరన్నారు. కానీ, మన దగ్గర ఇలాంటి పరిస్థితి లేదన్నారు. వ్యాపారాలను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే.. దేశంలో వ్యాపార వేత్తలు చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు.