Begin typing your search above and press return to search.

అవును.. ఈ మోపెడ్ మీద వెళ్లే మహిళ.. ఏపీ ఎమ్మెల్యే

అయితే.. అలాంటి వాటికి చెక్ చెబుతూ.. సరికొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్న కొత్తతరం పొలిటిషియన్లు ఇప్పుడు వస్తున్నారు

By:  Tupaki Desk   |   18 July 2024 4:56 AM GMT
అవును.. ఈ మోపెడ్ మీద వెళ్లే మహిళ.. ఏపీ ఎమ్మెల్యే
X

తెలుగు రాష్ట్రాల్లో గ్రామ సర్పంచ్ హడావుడే ఒక రేంజ్ లో ఉంటోంది. అలాంటిది ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుంది? గన్ మెన్లు.. మంది మార్బలం.. కాలు బయట పెట్టినంతనే కార్ల కాన్వాయ్ అన్న విషయాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. అధికార పార్టీకి చెందిన వారైతే ఇంకో రేంజ్ లో ఉంటుంది.

అయితే.. అలాంటి వాటికి చెక్ చెబుతూ.. సరికొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్న కొత్తతరం పొలిటిషియన్లు ఇప్పుడు వస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే. తాను ప్రజాప్రతినిధినన్న దర్పం చూపించని ఆమె.. సింఫుల్ గా తన రెడ్ కలర్ వెస్పా మోపెడ్ మీద వెళుతున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా.. ఏపీలోని ఉమ్మడి క్రిష్ణా.. గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలకు అర్భాటాలు ఎక్కువన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రాంతానికి చెందిన గళ్లా మాధవి.. కొత్త చరిత్రకు తెర తీయటం అందరిని ఆకర్షిస్తోంది. ఆమె గురించి మాట్లాడేలా చేస్తోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. తన నియోజకవర్గం పరిధిలోని డివజన్లలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గన్ మెన్లను పక్కన పెట్టేసి.. స్వయంగా వాహనాన్ని నడుపుతూ వెళుతున్న ఆమె.. ప్రజల సమస్యల్ని తెలుసుకొంటున్నారు. వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి బయలుదేరుతున్న ఆమె.. గంటల వ్యవధిలో తాను టార్గెట్ గా పెట్టుకున్న డివిజన్ ను సందర్శించి.. అక్కడి ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యల్ని అధికారుల వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఉదయాన్నే డివిజన్ల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆమె.. ఇప్పటికే నాలుగుడివిజన్లను పూర్తి చేయటం.. తాను సేకరించిన సమస్యలను ఉన్నతాధికారుల ముందు పెడుతున్నారు.

తనను గెలిపిస్తే సేవకురాలిగా పని చేస్తానని ప్రచార సమయంలో మాట ఇచ్చానని.. అందుకే కారులో కాకుండా టూవీలర్ మీద తిరుగుతున్నట్లు ఆమె చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మారి నెల రోజులు అవుతున్నా.. అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడట్లేదని.. అధికారులు సమస్యల పరిష్కారానికి స్పందించాలని కోరుతున్నారు. ఏమైనా పని మీద ఫోకస్ పెడుతున్న గళ్లా మాధవిని అభినందించాల్సిందే.