Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఎత్తైన గామారే టెలిస్కోప్.. భారత్ లో ఎక్కడో తెలుసా?

ఆసియాలోనే అతిపెద్దది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన గామారే టెలిస్కోప్ భారత్ లోనే ఉంది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 5:30 PM GMT
ప్రపంచంలోనే ఎత్తైన గామారే టెలిస్కోప్.. భారత్  లో ఎక్కడో తెలుసా?
X

ఆసియాలోనే అతిపెద్దది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన గామారే టెలిస్కోప్ భారత్ లోనే ఉంది. దీన్ని లడాఖ్ లో ఆవిష్కరించారు. 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న "హాన్లే" ప్రాంతంలో ఈ ఇమేజింగ్ చెరెన్ కోవ్ టెలిస్కోప్ ను ప్రారంభించారు.

అవును... ఆసియాలోనే అతిపెద్దది, ప్రపంచంలోనే అతి ఎత్తైన టెలిస్కోప్ ను లడఖ్ లో ఆవిష్కరించారు. మెజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్పరిమెంట్ (ఎం.ఏ.సీ.ఈ) గా పిలిచే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఈసీఐఎల్, ఇతర పారిశ్రామిక సంస్థల సహాయంతో దీన్ని దేశీయంగా రూపొందించారు.

ఈ మెజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్పరిమెంట్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గామా కిరణాలను అధ్యయనం చేయడానికి అనుమతించడం ద్వారా కాస్మిక్ కిరణాల పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ముందంజలో ఉంచడానికి సహకరిస్తుందని అంటున్నారు.

ఇది బ్లాక్ హోల్స్, సూపర్ నోవా, గామా కిరణాల పేలుళ్లు వంటి శక్తివంతమైన సంఘటనల గురించి లోతైన అవగాహనకు మార్గం సుగమం చేస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఇది ప్రారంభానికి ముందే సుమారు 200 మిలియన్ కాంతి సంవత్సరాల దురంలోని గామా కిరణాలను గుర్తించి సత్తా చాటిందని చెబుతున్నారు.

ఈ మెజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్పరిమెంట్ వ్యాసం 21 మీటర్లు కాగా.. బరువు 175 టన్నులు. ఇక 356 చదరపు మీటర్ల రిఫ్లెక్టర్ వైశాల్యం కలిగి 1424 డైమండ్ టర్న్ మెటాలిక్ మిర్రర్ ఫేసేస్ తో 712 యాక్యుయేటర్లు, 1088 ఫోటో మల్టిప్లేయర్ ట్యూబ్ లు, 68 కెమెరా మాడ్యూల్స్ తో నిర్మించబడింది!

హాన్లే ప్రాంతంలోనే ఎందుకు..?

ఈ మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్ పరిమెంట్ అబ్జరేటరీని లడ్డాఖ్ లోని హాన్లే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతంలొనే దీన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని.. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఇక్కడ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇందులో ఒక ప్రధాన కారణం... ఇది అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండటమే.

ఇదే సమయంలో.. గామా కిరణాలను గుర్తించడానికి అత్యంత తక్కువ లైట్ పొల్యూషన్ ఈ హాన్లే ప్రాంతంలో ఉండటం మరో కారణం అని చెబుతున్నారు. దీంతో... గామా కిరణాలపై పరిశోధనలకు ఈ ప్రాంతం స్వర్గం లాంటిదని అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డా. ఏకే మహంతి తెలిపారు.