1947 ఆగస్టు 15 : ఆ రోజున గాంధీ ఎక్కడ ఉన్నారు... ఏమి జరిగింది ?
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అన్నది తెలిసిందే. కానీ ఆగస్టు 14 అర్ధరాత్రి వచ్చింది
By: Tupaki Desk | 15 Aug 2024 4:03 PM GMTఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అన్నది తెలిసిందే. కానీ ఆగస్టు 14 అర్ధరాత్రి వచ్చింది. అప్పటికే 15 ఎంటర్ అయింది కాబట్టి ప్రతీ ఏటా ఆ రోజున వేడుకలు చేసుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఏమి జరిగింది అసలు జాతిపితగా పేరు గడించిన మహాత్ముడు ఎక్కడ ఉన్నారు అన్నది ఎవరికైనా ఆసక్తిని కలిగించేదే.
ఇంకా చెప్పాలంటే ఈ తరానికి దానికి గురించి తెలియాల్సి ఉంది. దేశం అప్పటికి రెండు వందల ఏళ్ల పాటు దాస్య శృంఖలాలో మగ్గింది. స్వేచ్ఛా వాయువులు తొలి సారి పీల్చుకుంటున్న తరుణం అది. దేశమంతా ఆ సంబరాలలో మునిగి తేలుతున్న వేళ మహాత్మా గాంధీ కూడా ఉండాలి కదా. కానీ ఆయన ఈ సంబరాలలో ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రశ్న ఉంది.
వాటికి ఒక జవాబు అయితే గాంధీ ఈ వేడుకల సమయంలో అంటే 1947 ఆగస్టు 15న ఢిల్లీలో లేరు. ఆయన ఆ రోజున బెంగాల్ లో ఉన్నారు. బెంగాల్ లో నోవాఖలీలో ఉన్నారు. అప్పటికే దేశ విభజన గాయాలు చాలా పెద్దవిగా మారి బెంగాల్ అల్లకల్లోలం అయింది. దాంతో గాంధీ హిందూ ముస్లిం ల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడం కోసం అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ విధంగా ఆయన తొలి స్వాతంత్ర వేడుకల్లో పాలు పంచుకోలేదు అన్న మాట. ఆయన 1948 జనవరి 30న హత్య కావించబడ్డారు. కాబట్టి రెండవ వేడుకల నాటికి లేకుండా పోయారు. మొత్తానికి చూస్తే ఆగస్టు 15 వేడుకలలో గాంధీ ఎపుడూ పాల్గొనలేదు అని తేటతెల్లం చేస్తోంది గత చరిత్ర.
సరే దాని కంటే ముందు ఆగస్ట్ 15న స్వాతంత్రం దేశానికి లభిస్తుందని తెలియగానే పండిట్ నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి ఒక లేఖ రాశారు. మీరు తప్పనిసరిగా వేడుకల్లో పాల్గొనాలని. దానికి గాంధీ బదులిస్తూ హిందూ ముస్లింలు ఘర్షణలు పడుతున్న వేళ తాను సంబరాల్లో పాల్గొనలేనని చెప్పేశారు. ఈ ఘర్షణలు ఆపడానికి తన ప్రాణాలు అయినా ఇస్తాను అని కూడా ఆయన చెప్పారు
మరో వైపు చూస్తే దేశానికి తొలి ప్రధాని కాకుండానే జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత దేశాన్ని ఉద్దేశించి ఒక చారిత్రక ప్రసంగం చేశారు. ట్రిస్ట్ విత్ డెస్టినీ గా పేర్కొనే ఆ ప్రసంగం ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ అంటే ఈ రోజున ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి ఇచ్చారు. అలా నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఆలకించింది. కానీ మహాత్ముడు ఆ ప్రసంగం కూడా వినలేదు. గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. ఇది కూడా చరిత్రలో ఉంది.
మరో చిత్రమేంటి అంటే దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది అని మనం చదువుకున్నాం. అది నిజం. కానీ ఆ రోజుకీ బ్రిటిష్ ప్రభువు మౌంట్ బాటన్ ఈ దేశంలోనే ఉన్నారు 15న ఆయన తన ఆఫీసులో యధాప్రకారం తన విధులను నిర్వహించారు. ఇక నెహ్రూ తన మంత్రి వర్గం జాబితాను బాటన్ కే ఇవ్వడం విశేషం.
ఇక ఎర్రకోట వద్ద ప్రతీ ఆగస్టు 15కి జాతీయ జెండా ఎగరవేయడం ఆనవాయితీ. కానీ 1947 ఆగస్టు 15న అది జరగలేదు. దీనికి సంబంధించి లోక్ సభ సెక్రటేరియట్ రికార్డుల ప్రకారం చూస్తే ఆగస్టు 16న ఎర్ర కోట వద్ద నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇక భారత్ కి స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే అమరుల పోరాటాలు త్యాగాలు అని అందరికీ తెలుసు. వీటితో పాటుగా అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం జరగడం ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి ఎదురుగాలులు వీచడం కూడా అతి ముఖ్య కారణం అని చరిత్ర చెబుతోంది. ఆ విధంగా చూస్తే బ్రిటిష్ వారి వెర్షన్ వేరేగా ఉంది.
ఆనాటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ చెప్పిన వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారని ఉంది. అంటే బ్రిటిష్ ప్రభువులు తమ మనసు మార్చుకుని భారత్ ని వీడిపోవడానికి తామే నిర్ణయించుకున్నారు అన్నది దీనిని బట్టి అర్ధం అవుతోంది.
మరో తమాషా ఏంటి అంటే ముందు అఖండ భారత్ విడిపోయి భారత్ పాకిస్థాన్ అయింది. ఆ తరువాత రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించారు. అలా చూస్తే ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారన్నది చరిత్ర.
ఇక దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్ట్ 15న వచ్చింది కానీ జాతీయ గీతం అయితే అప్పటికి లేదు నిజానికి చూస్తే జనగణమణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాశారు. అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది. అలా దానిని మనం అధికారికంగా తరువాత కాలం నుంచి వినియోగిస్తున్నాం.
మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయన్నది. అందులో దక్షిణ కొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. అంటే ఇది భారత్ కంటే రెండేళ్ళు ముందు అన్న మాట. అలాగే బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. ఇక కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఇలా చరిత్రలో ముడిపడి ఈ తరానికి తెలియాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. అవి ఆసక్తిగానూ విజ్ఞానాన్ని అందించేవిగానూ కూడా ఉంటాయి.