గ్యాంగ్ స్టర్స్ లవ్ మ్యారేజ్... ఢిల్లీలో టెన్షన్ కి రెండు కారణాలు!
డజన్ల కొద్దీ కేసులున్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు సుమారు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఈ రోజు వివాహబందంలోకి అడుగుపెట్టబోతున్నారు.
By: Tupaki Desk | 12 March 2024 6:13 AM GMTడజన్ల కొద్దీ కేసులున్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు సుమారు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఈ రోజు వివాహబందంలోకి అడుగుపెట్టబోతున్నారు. హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడి, రాజస్థాన్ కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడం మింజ్ లు ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలోని ఒక కల్యాణ్ మండపంలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో... దేశరాజధానిలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఏర్పడింది!
అవును... ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ - 3లో ఉన్న సంతోష్ గార్డెన్ లో గ్యాంగ్ స్టర్స్ సందీప్, అనురాధా ల వివాహం జరగనుంది. ఈ మేరకు సందీప్ తరుపు న్యాయవాది వివాహ వేదికను బుక్ చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మొహరింపులు, భారీ ఎత్తున చేరుకున్న పోలీసులతో ఢిల్లీలోని సంతోష్ గార్డెన్స్ ప్రాంతం శతృదుర్భేద్యంగా మారింది.
జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ సందీప్.. బెయిల్ పై ఉన్న అనురాధ ల వివాహం నేపథ్యంలో పోలీసులు ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి... గ్యాంగ్ వార్ జరగకుండా ఉండటానికి కాగా.. మరొకటి, సందీప్ తప్పించుకుని పోకుండా ఉండేందుకని అంటున్న్నారు. దీంతో వీరి వివాహ వేడుకను పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు.
ఈ వివాహానికి సందీప్ కుటుంబానికి చెందిన సుమారు 150 మంది అతిథులు హాజరవుతున్నారని తెలుస్తుండగా.. వారందరికీ ముందుగానే బార్ కోడ్ బ్యాండ్స్ ని అందజేయడంతొపాటు.. వారు వచ్చే వాహనాలకు ఎంట్రీ పాస్ లను ఇచ్చారని తెలుస్తుంది. వేడుకకు వెళ్లే ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, డ్రోన్ లతో అక్కడి కార్యకలాపాలను అనునిత్యం పర్యవేక్షిస్తున్నారని.. అందుకోసం సుమారు 250 మంది పోలీసులతో పాటు అత్యాధునిక ఆయుధాలు కలిగి ఎస్.డబ్ల్యూ.ఏ.టి. కమాండోలను మొహరించారని అంటున్నారు!
కాగా... హర్యాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడి.. రాజస్థాన్ కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడం మింజ్ లు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ సుమారు నాలుగేళ్లుగా ప్రేమలో ఉండగా.. వీరిద్దరి వివాహం ఈ రోజు జరగనుంది. ఇక అనురాధ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉండగా.. సందీప్ మాత్రం తీహాడ్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలో వీరి వివాహానికి కోర్టు సందీప్ కు ఆరుగంటల అనుమతి ఇచ్చింది.