తెలంగాణను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం... టి.మంత్రి సంచలన వ్యాఖ్యలు!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమంలో భాగంగా... మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 13 Oct 2023 4:42 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో అభివృద్ధి చూపించి, అభివృద్ధి ఆశచూపించి కొంతమంది నేతలు ఓట్లు అడుగుతున్నారు. ఈ సమయంలో ఇంకా ఆంధ్రాని బూచిగా చూపిస్తూ.. విడిపోయిన రాష్ట్రాలను ఏకంచేస్తారని చెబుతూ ఓట్లు అడిగే పరిస్థితికి చేరుకున్నారో ఇంకొకరు. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ మంత్రి, బీఆరెస్స్ నేత గంగుల కమలాకర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమంలో భాగంగా... మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్, బిజెపి పార్టీలు బి ఫారాలు అమ్ముకుంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో... ఆ రెండు పార్టీల బి ఫారాలు ఢిల్లీలో ఒకటే చోట సిద్ధమవుతాయి అని ఆరోపించారు.
ఇక బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో గుండు సున్నా వస్తుందని జోస్యం చెప్పిన ఆయన.. ఆ భయంతోనే ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక, మతతత్వ పార్టీ అయిన బిజెపికి, భూకబ్జాలు చేసే పార్టీ అయినా కాంగ్రెస్ కు అధికారం ఇవ్వద్దని ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలను ఆయన కోరారు.
సుమారు 40, 50 సంవత్సరాలు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలే గతంలో ఉన్న దరిద్రానికి కారకులని అన్నారు. వీరంతా ఇప్పుడు ఆంధ్రుల ముసుగులేసుకుని వస్తున్నారని చెప్పుకొచ్చారు. వారిని నమ్మి వీళ్ల చేతుల్లో అధికారం పెడితే.. అది కాస్తా ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోద్దని అన్నారు. ఫలితంగా తెలంగాణలో ఉన్న బొగ్గు ఎత్తుకుపోయి, హైదరాబాద్ సంపద ఎత్తుకపోయి గతంలో ఉన్న కష్టాలను తెస్తారని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆంధ్ర నేతలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... రాబోయే కాలంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. నెటిజన్లు కీ బోర్డులకు పనిచెబుతున్నారు. ఓట్లు అడగాడిని ఇంకా చాలా మార్గాలు ఉంటాయని ఎద్దేవా చేస్తున్నారు!