Begin typing your search above and press return to search.

తెలంగాణలో కొత్త చాక్లెట్లు... అందులో ఏముందంటే...?

ఇంతవరకు బాగానే ఉంది కానీ... ఆ చాక్లెట్లు తిన్న విద్యార్ధులంతా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:02 AM GMT
తెలంగాణలో కొత్త చాక్లెట్లు...  అందులో ఏముందంటే...?
X

ఇప్పటికే యువత మత్తు పదార్ధాల భారీన పడుతున్నారని అంటు ప్రభుత్వాలు, ఇటు తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సిటీలలో ఈ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్కూలు పిల్లలపై కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. చాక్లెట్ల రూపంలో మత్తును అలవాటు చేసి, తద్వారా దందాకు తెరతీస్తున్నారు. అలాంటి దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... స్కూల్ కి సమీపంలో ఉన్న ఒక పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను విద్యార్ధులు తరచూ తింటున్నారు. పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తుండటంతో అక్కడికి చేరుకునే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ... ఆ చాక్లెట్లు తిన్న విద్యార్ధులంతా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో పాన్ డబ్బా ఉంది. అక్కడ ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు విద్యార్ధులకు చాక్లెట్లను ఉచితంగా ఇస్తూ వచ్చారు. అయితే ఆ చాక్లెట్లు తిన్న విద్యార్ధులు క్లాసులోకి రాగానే మత్తులోకి జారుకోవడం, వింతగా ప్రవర్తిస్తుండటం చేస్తున్నారని ఉపాధ్యాయులు గమనించారు.

ఈ సమయంలో విద్యార్ధుల వింత ప్రవర్తనను గమనించిన ఉపాధ్యాయులు.. విషయం ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో... స్కూల్ సమీపంలో ఉన్న పాన్ డబ్బా వాళ్లు ఇచ్చిన చాక్లెట్లు తినడం వల్లే ఇదంతా జరుగుతోందని గ్రహించారట. తొలుత విద్యార్థులకు ఉచితంగా ఇస్తూ, వాటికి క్రమంగా వారు బానిసులైన తర్వాత రూ.20కి ఒక్కో చాక్లెట్ అమ్ముతున్నట్టు గుర్తించారట.

దీంతో పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు సమాచారం అందించారు ఉపాధ్యాయులు. ఇలా ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్.ఓ.టీ టీం సదరు పాన్ డబ్బాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు తొమ్మిది కిలోల గాంజా చాక్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వీరంతా ఒరిస్సా నుంచి గాంజాతో తయారుచేసిన చాక్లెట్స్‌ ను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలకు ముందుగా ఉచితంగా ఇవ్వడం, అనంతరం వారు అలవాటుపడిన తర్వాత అధిక ధరకు అమ్మి దందా చేయడం వీరి ఉద్దేశ్యమని గ్రహించినట్లు తెలిసింది. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!!