Begin typing your search above and press return to search.

బెంగళూరులో గంజాయి చాక్లెట్... డ్రగ్స్ బ్యాచ్ కొత్త టెక్నిక్!

దీంతో... గంజాయి చాక్లెట్ విక్రయాల నెట్‌ వర్క్ ఉత్తరప్రదేశ్ నుండి బెంగళూరు వరకు విస్తరించింది

By:  Tupaki Desk   |   25 Aug 2023 9:20 AM GMT
బెంగళూరులో గంజాయి చాక్లెట్... డ్రగ్స్ బ్యాచ్ కొత్త టెక్నిక్!
X

కాదేరూపమూ డ్రగ్స్ అమ్మకానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. అయినా కూడా కొత్త కొత్త బ్యాచ్, సరికొత్త ఆలోచనలతో డ్రగ్స్ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో సరికొత్త డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది.

అవును... కర్ణాటక రాష్ట్రంలో కొత్త రకం డ్రగ్స్‌ నెట్‌ వర్క్‌ వెలుగు చూసింది. ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్ లో తయారయ్యే గంజాయిని తీసుకొచ్చి బెంగళూరులో అమ్మేస్తున్నారని తెలిసింది. దీంతో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో డ్రగ్స్ డీలర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని అంటున్నారు.

గంజాయిని సిగరెట్లలో కలిపి వాడటం.. జాయింట్స్ అని, బాంగులు అని రకరకాల రూపంలో తీసుకుంటారని.. ఇంకొంతమంది ఇంజిక్షన్స్ రూపంలో తీసుకుంటారని చెబుతుంటారు. ఈ సమయంలో అలా అయితే పోలీసులకు దొరికిపోతున్నామని భావించారో ఏమో కానీ... కొత్తగా గంజాయి చాక్లెట్లు తెరపైకి తెచ్చారు.

దీంతో... గంజాయి చాక్లెట్ విక్రయాల నెట్‌ వర్క్ ఉత్తరప్రదేశ్ నుండి బెంగళూరు వరకు విస్తరించింది. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన గంజాయి చాక్లెట్ లను బెంగళూరులో విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. ఈ సమయంలో మునక్క, మహాకళ, ఆనంద, చార్మినార్ పేర్లతో చాక్లెట్లు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో ఆర్‌ఎంసీ యార్డు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అక్తర్ ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతనివద్ద నుంచి మొత్తం 6 లక్షల రూపాయల విలువైన గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా వివరాలు సేకరించిన పోలీసులు... .నిందితులు బాక్సులను దుకాణాల్లో ఉంచి ఒక్క చాక్లెట్ ను 20 రూపాయలకు అమ్ముతున్నారని తెలుసుకున్నారు. ఒకేసారి మూడు చాక్లెట్లు కొంటే ఆఫర్లో 50 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలుసిందట.

ఈ సమయంలో గంజాయి కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు మాత్రం తప్పించుకుని పోయారని సమాచారం. ఇలా అదృశ్యమైన వ్యక్తులను ఫలానా వారిగా గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు.

అనంతరం నిందితులను విచారించిన తర్వాత బెంగళూరు నగరంలో మరిన్ని చోట్ల గంజాయి చాక్లెట్లు లభించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రైలులో గంజాయి చాక్లెట్ లు తీసుకొచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నారని బెంగళూరు నార్త్ డివిజన్ డీసీపీ శివప్రకాష్ దేవరాజ్ తెలిపారు.