తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఆ ఇద్దరి బరితెగింపు!
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి దగ్గర్లో ఇద్దరు యువకుల బరితెగింపు షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 22 April 2024 5:36 AM GMTగంజాయి బ్యాచ్ బరి తెగించింది. గడిచిన కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు భారీగా పెరగటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ద్వారా దేశ వ్యాప్తంగా గంజాయి భారీగా సప్లై అవుతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో బోలెడన్ని చూశాం. హైదరాబాద్ మహానగరంలో గంజాయి బ్యాచ్ ను.. గంజాయి స్టాక్ ను తరలించే వారిని పెద్ద ఎత్తున పట్టుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి దగ్గర్లో ఇద్దరు యువకుల బరితెగింపు షాకింగ్ గా మారింది.
తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి సమీపంలోని నవోదయ కాలనీలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్న వేళ.. స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకిదిగిన వారు.. ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ముగ్గురు యువకులు మూట పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. వారిని స్థానికులు ప్రశ్నించారు.
అందులో ఒకరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు దొరికారు. అయితే.. స్థానికులకు ఎదురు తిరగే ప్రయత్నం చేశారు. అయితే.. వీరి తీరుకు భయపడని వారు.. ఏకమై ఆ ఇద్దరికి దేహశుద్ధి చేశారు. చేతులను.. కాళ్లను తాళ్లతో కట్టేశారు. వారి వద్ద రెండు కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు దగ్గరకు వచ్చి.. గంజాయి అమ్మే బరితెగింపు సంచలనంగా మారింది.
హైసెక్యూరిటీ జోన్ గా ఉండే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు దగ్గర్లోనే ఇలాంటి ఘటన జరగటాన్ని స్థానికులు తప్పు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మారతాయని.. పోలీసుల నిఘా మరింత పెరగాలని కోరుతున్నారు. ఇంతకూ ఈ ఇద్దరు యువకులు ఎవరు? వారి వెనుక ఉన్నదెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారెంత మంది ఉన్నారు? సీఎం క్యాంప్ ఆఫీసుకు దగ్గర్లోనే ఇలాంటి పని చేయాలని ఎందుకు ప్లాన్ చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.