గంటా శీనన్నకు ఘనమైన గ్రీటింగ్స్...ఛాన్స్ ఉందా ?
మా శీనన్న మంత్రి కావాల్సిందే అని వారు పట్టుదలగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అంతే అని కూడా అంటున్నారు.
By: Tupaki Desk | 2 Jan 2025 4:00 AM GMTఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలతో కలుపుకుని మొత్తం కంటిన్యూస్ గా మంత్రిగా ఏడేళ్ళ పాటు పనిచేశారు. కీలకమైన శాఖలను కూడా చూశారు. 2019లో జగన్ వేవ్ ని తట్టుకుని మరీ గెలిచారు. కానీ పార్టీ ఓటమి పాలు కావడంతో విపక్ష ఎమ్మెల్యేగా ఉండిపోయారు. ఇక 2024లో మాత్రం ఆయన భారీ మెజారిటీతో గెలిచి పార్టీ గెలిచినా కూడా మంత్రి యోగం దక్కలేదు. జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోయారు.
అందుకు గానూ ఆయన ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఆయన అభిమానులూ అనుచరులు మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నారు. మా శీనన్న మంత్రి కావాల్సిందే అని వారు పట్టుదలగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అంతే అని కూడా అంటున్నారు.
ఇక 2024లో ఎమ్మెల్యేగానే గంటా ఉంటూ వచ్చారు. 2025 వచ్చింది. గంటా అనుచరులు అయితే ఈ ఏడాది అంతా మా శీనన్నకు బాగుండాలని కోరుకున్నారు. ఆయనకు ఘనమైన పదవులు దక్కాలని కూడా వారు ఆకాంక్షిస్తున్నారు. మా శీనన్న ఇంతకు ఇంతా ఎదిగి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.
ఈ కోరికను బాహాటం చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఫ్లెక్సీలు కట్టారు. హడావుడి చేశారు. మరి ఇంతకీ శీనన్నకు మంత్రి యోగం ఉందా అన్నదే చర్చగా ఉంది. రెండు రోజుల క్రితం చూస్తే కనుక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు తనకు మంత్రి పదవి కంటే పార్టీ ప్రెసిడెంట్ పదవే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు.
ఆ విధంగా ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గానే మరింత కాలం కొనసాగుతాను అని అంటున్నారు. దాంతో విశాఖ జిల్లాలో మంత్రి పదవి కనుక భర్తీ చేస్తే కచ్చితంగా గంటాకు చాన్స్ వస్తుంది అని అంటున్నారు. ఏపీకి విశాఖ జిల్లా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం కూడా ఈ మెగా సిటీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అటువంటి జిల్లాకు మినిస్టర్ పదవి అన్నది కేటాయించలేదు.
ఈ ఏడాదిలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే కనుక విశాఖ నుంచి ఒకరికి బెర్త్ ఖాయమని అంటున్నారు. పల్లాకు ఆ అవకాశం అనుకున్నారు. కానీ ఆయనే వద్దు అంటున్నారు. దాంతో గంటా పేరు మళ్ళీ తెర ముందుకు వస్తోంది అని అంటున్నారు. అంగబలం అర్ధం బలం నిండుగా ఉన్న గంటాకు మినిస్టర్ గా చాన్స్ ఇస్తే జిల్లాను ఒక గాటిన పెడతారు అని అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వ పాలనను జిల్లాలో సమర్ధంతగా అమలు అయ్యేలా చూస్తారని టీడీపీ మరింతగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
సామాజిక సమీకరణలు కూడా అందుకు అనుకూలిస్తున్నాయని చెబుతున్నారు. టీడీపీ కేబినెట్ లో సీనియర్లు తక్కువగా ఉన్నారు. దాంతో ఆ అవసరం కూడా ఉంది అని అంటున్నారు. రూరల్ జిల్లాలో అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఇపుడు గంటాకు మంత్రి పదవి ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. గంటా అభిమానుల కోరిక నిజం కావాలంటే దానికి మంత్రి వర్గ విస్తరణ వరకూ సమయం ఉంది. అపుడు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.