Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ న్యూస్ చెప్పిన మాజీ మంత్రి....వైసీపీకి షాకేనా ?

వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు అని బాంబు పేల్చారు

By:  Tupaki Desk   |   12 Sep 2024 6:01 PM GMT
బ్రేకింగ్ న్యూస్ చెప్పిన మాజీ మంత్రి....వైసీపీకి షాకేనా ?
X

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తరచుగా మీడియాలో కనిపిస్తుంటారు. ఆయన వచ్చినపుడల్లా స్టేట్ వైడ్ న్యూస్ నే చెబుతూంటారు. ఆయన బ్రేకింగ్ న్యూస్ ని తాజాగా రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు అని బాంబు పేల్చారు

ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అంతా అధినేత జగన్ వైఖరితో విసిగిపోయారు అని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి గేట్లు వేసి ఉంచింది కానీ ఒక్కసారి కనుక ఎత్తేస్తే వారంతా వచ్చి కూటమిలో చేరుతారు అపుడు జగన్ ఒక్కరే మిగులుతారు అని గంటా అంటున్నారు.

ఇటీవల ఎన్నికల్లో ప్రజలు జగన్ ని చిత్తుగా ఓడించినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని గంటా ఘాటు విమర్శలే చేశారు. వరద బాధితులను ఆదుకోకుండా జైలులో ఉన్న నిందితుడిని జగన్ పరామర్శించడమేంటని ఆయన నిలదీశారు.

వరద బాధితులను కూటమి ప్రభుత్వం గొప్పగా ఆదుకుంటోందని అయినా విమర్శలు చేస్తూ వస్తున్న జగన్ చరిత్రహీనుడుగా మారుతారని కూడా మంటెక్కించే మాటలే వదిలారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అన్న వార్త గంటాకు ఎలా తెలుసు ఎవరు చెప్పారు అన్నదే చర్చగా ఉంది.

టీడీపీ కూటమి కానీ చంద్రబాబు కానీ వైసీపీ ఎమ్మెల్యేల మీద ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు అని అంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో శాసనమండలిలో లోటు ఉంది. దాంతో అక్కడే గురి పెట్టింది. టీడీపీ కూటమికి మండలిలో బలం పెరిగితే బిల్లులు అక్కడ పాస్ అవుతాయి. రాజ్యసభలో సభ్యులు ఎవరూ ఇప్పటిదాకా లేరు. అక్కడ ఉంటే ప్రాతినిధ్యం ఉంటుంది. ఎన్డీయేలో కీలక మిత్రుడిగా మరింత గౌరవం దక్కుతుంది.

అంతే కానీ వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఏమి చేస్తారు అన్న మాట కూడా ఉంది. 2014 నుంచి 2019 మధ్య ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకుంది అంటే అప్పట్లో వైసీపీకి టీడీపీకి మధ్య మార్జిన్ తక్కువగా ఉంది. వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో కొంతమందిని లాగేసి వైసీపీని సగానికి సగం పరిమితం చేసింది.

పైగా రాజ్యసభ సభ్యుల విషయంలోనూ శాసనమండలి విషయంలోనూ ఎమ్మెల్యేల నంబర్ ప్రధానం కాబట్టి వైసీపీని వీక్ చేస్తే ఎక్కువ మంది సభ్యులను గెలిపించుకోవచ్చు అన్న వ్యూహాలు ఉన్నాయి. అలా అపుడు ఫిరాయింపులు ప్రోత్సహించారు కానీ దాని వల్ల చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నారు.

ఇపుడు బండ మెజారిటీ ఉంది. ఈ సమయంలో కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరచి వారికి చోటు ఇస్తే వర్గ పోరు తప్ప పెద్దగా ఒనగూడేది ఏదీ ఉండదు అని అంటున్నారు. అందుకే టీడీపీ పెద్దలు ఆ ఊసే తలవడం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ వైపు కనీసంగా అరడజన్ మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడే వారు ఉన్నారు.

ఒకరిద్దరు అటు వైపు చూసినా వైసీపీకి కొత్తగా వచ్చే నష్టం ఏదీ లేదనే అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఎటూ లేదు, ఇపుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎటు వెళ్ళినా వైసీపీకి బిగ్ ట్రబుల్ ఉంటుందా అన్నది కూడా పాయింట్ గా ఉంది.

మరి ఎందుకు గంటా ఈ బ్రేకింగ్ న్యూస్ పేల్చారు అంటే ఆయన మరోసారి మీడియాలో హైలెట్ కావడానికేనా అన్న చర్చ వుంది. ఆయన తాను రాష్ట్ర స్థాయి నేతను అని తరచూ చెప్పుకోవడానికే మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తూంటారు అని అంటున్నారు. వైసీపీని జగన్ ని విమర్శించడం ద్వారా హై కమాండ్ దృష్టిలో ఉండాలని కోరుకుంటున్నారు అని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.