దెబ్బకు మాజీ ఎమ్మెల్యే అయిన గంటా... న్యాయపోరాటం అంటున్న టీడీపీ నేత
దీంతో విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ అయిపోయారు.
By: Tupaki Desk | 23 Jan 2024 5:04 PM GMTటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ అయ్యారు. ఆయన చేసిన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఈ నెల 22న తీసుకున్నట్లుగా అసెంబ్లీ వ్యవహారాల విభాగం వెల్లడించింది. అయితే మంగళవారం సాయంత్రం దీనిని ప్రకటన రూపంలో తెలియచేసారు. దీంతో విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ అయిపోయారు.
ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కేంద్రం చేస్తుందని దానికి నిరసనగా 2021 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేశారు. అయితే అది స్పీకర్ ఫార్మెట్ లో లేదని దాన్ని మొదట తిరస్కరించారు. ఆ మీదట ఆయన ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ని ఆయన నివాసంలో కలసి తన రాజీనామా గురించి వివరించి తాను ఇష్టపూర్వకంగానే చేస్తున్నట్లు తెలిపారు.
తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇది జరిగి కూడా చాలా కాలం అయిపోయింది. ఈ మధ్యలో వచ్చిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గంటా ఓటు వేశారు. అయితే ఈ మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యేల బలం బట్టే ఆధారం చేసుకుని అక్కడ విజయావకాశాలు ఉన్నాయి.
దీంతో గంటా దీని మీద రెస్పాండ్ అయ్యారు. జగన్ కి రాజ్య సభ ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు. దాదాపుగా యాభై మంది దాకా ఎమ్మెల్యేలు ఓటు వేయరని అనుమానంతోనే ఆయన తన ఓటు హక్కుని తొలగించారు అని ఆరోపించారు. అయితే తాను ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదని అన్నారు.
తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తనకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఈ చర్య తీసుకోవడమేంటని ఆయన మండిపడ్డారు. మరో వైపు చూస్తే తాను న్యాయ సలహా తీసుకుని తన రాజీనామా విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద పోరాటం చేస్తాను అని అంటున్నారు.
తాను ఏలాగైనా రాజ్యసభ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే సరైన సమయంలో గంటా రాజీనామాను ఆమోదించడం ద్వారా వైసీపీ దెబ్బ కొట్టినట్లు అయింది అని అంటున్నారు. గంటా అప్పట్లో రాజీనామా చేసినా కూడా వైసీపీ విషయంలో ఏ విమర్శలు చేయకుండా ఉండేవారు.
ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నాలుగేళ్ల పాటు ఆ పర్టీలో పెద్దగా సౌండ్ చేసిన దాఖలాలు లేవు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతారు అని కూడా ప్రచారం సాగింది. దాంతో గంటా రాజీనామాను అప్పట్లో వెనక్కి పెట్టారు అని ఒక టాక్ నడచింది. అయితే గంటా ఆ తరువాత టీడీపీలోనే ఉంటూ వైసీపీ మీద తరచూ ఈ మధ్య విమర్శలు చేయడం మొదలెట్టారు. దాంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కలు అన్నీ చూసుకుని చేతిలో ఉన్న రాజీనామాను స్పీకర్ ద్వారా వైసీపీ ఆమోదింపచేసింది అని అంటున్నారు. చూడాలి మరి గంటా న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తారో.