Begin typing your search above and press return to search.

భీమిలీ మీద గంటాకు అంత కాన్ఫిడెన్సా ?

విశాఖ జిల్లా భీమునిపట్నం గంటాకు స్వీట్ మెమొరీగా ఎపుడూ ఆయన పొలిటికల్ కెరీర్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 April 2024 3:38 AM GMT
భీమిలీ మీద గంటాకు అంత  కాన్ఫిడెన్సా ?
X

విశాఖ జిల్లా భీమునిపట్నం గంటాకు స్వీట్ మెమొరీగా ఎపుడూ ఆయన పొలిటికల్ కెరీర్ లో ఉంటుంది. ఆయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 37 వేల పై దాటిన మెజారిటీ ఇచ్చింది. అయిదేళ్ల పాటు మంత్రిగా ఆయన పనిచేసే అవకాశం భీమిలీ నుంచే కలిగింది. దాంతో గంటాకు భీమిలీ అంటే అదొక రకం సెంటిమెంట్.

నిజం చెప్పాలీ అంటే ఆయన 2019లోనే భీమిలీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి నిముషంలో ఆయనను విశాఖ నార్త్ కి మార్చారు. ఇక 2024లో కూడా ఆఖరు దాకా ఆయనకు భీమిలీ టికెట్ ఫిక్స్ కాలేదు. ఆయనను చీపురుపల్లి వెళ్లమని పార్టీ హై కమాండ్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ గంటా మాత్రం పట్టువదలకుండా భీమిలీ నుంచే పోటీ అంటూ వచ్చారు. చివరిని ఆ సీటుని సాధించారు. ఇక మంచి ముహూర్తం చూసి ఆయన ప్రచారం మొదలెట్టారు. భీమిలీలోని అన్నవరం గ్రామం నుంచి గంటా ప్రచారం స్టార్ట్ చేశారు. అన్నవరం కూడా ఆయన సెంటిమెంట్ ప్రాంతం కావడం విశేషం.

మరో వైపు చూస్తే గంటా ఈసారి తన మెజారిటీ ఏపీలోనే టాప్ లేపాలని అంటున్నారు. భీమిలీలో తన గెలుపు చూసిన వారు అంతా ఇంత మెజారిటీ ఎలా అంటూ చర్చించుకోవాలని అంటున్నారు. గంటా దానికి తగినట్లుగానే అన్ని రకాలైన కసరత్తులు తెర వెనక చేసుకుంటూ రంగంలోకి దిగిపోయారు.

భీమిలీ టికెట్ ని ఆశించిన టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఇంటికి వెళ్ళి మరీ ఆయనను తనతో కలుపుకున్నారు. అదే విధంగా జనసేనకే టికెట్ ఇవ్వాలని చివరి దాకా పట్టుబట్టిన ఆ పార్టీ భీమిలీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ని సైతం గంటా మంచిగా చేసుకుని తన వెంట ఉంచుకున్నారు.

ఇలా చూసుకుంటే కనుక గంటా మీద ఆయన భీమిలీ అభ్యర్ధిత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన వారంతా ఇపుడు ఆయనతోనే అంటున్నారు. అలా గంటా ఘటికుడు అనిపించుకున్నారు. తనకు టీడీపీలో కానీ కూటమిలో ఉన్న జనసేనలో కానీ ఏ రకంగా ఇబ్బందులు లేకుండా చూసుకుని ఆయన ప్రచారం లోకి దిగిపోయారు. ఇంకో వైపు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలను ఆయన ఆకట్టుకుంటున్నారు. ప్రతీ మండలం నుంచి బలమైన నేతలను టీడీపీలోకి చేర్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈసారి కనీసంగా యాభై వేల పై చిలుకు భారీ మెజారిటీతో గెలవాలని గంటా లక్ష్యంగా పెట్టుకున్నారు అని అంటున్నారు. అయితే భీమిలీలో ఆయన ప్రత్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన జనంలో ఉండే నేత. పైగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరు. గంటా మీద విమర్శలు ఏంటి అంటే ఆయన గెలిచాక అందుబాటులో ఉండరని. దీనినే వైసీపీ నేతలు ప్రచారంలో పెడుతున్నారు

ఇక మరో వైపు చూస్తే వైసీపీ కూడా స్ట్రాంగ్ గా ఇక్కడ ఉంది. భీమిలీలో ప్రజానీకంలో అత్యధిక శాతం పేదలు బడుగు వర్గాల వారు ఉన్నారు. సంక్షేమ పధకాలు వైసీపీకి అండగా ఉంటాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందువల్ల గంటా అనుకున్నట్లుగా అర లక్షకు పైగా భారీ మెజారిటీ సాధ్యమేనా అన్నది ఒక చర్చగా ఉంది. అదే సమయంలో హోరా హోరీ పోరు తప్పదని కూడా అంటున్నారు.