ఈ కాపు నేతకు చివరకు అదే సీటు!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తున్న టికెట్ల జాబితాల్లో కొందరు సీనియర్ నేతలకు టికెట్లు లభించని సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 March 2024 6:52 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తున్న టికెట్ల జాబితాల్లో కొందరు సీనియర్ నేతలకు టికెట్లు లభించని సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చంద్రబాబు మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ పొత్తుల్లో భాగంగా ఈసారి 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు జాబితాల్లో 139 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కాగా ఈ మూడు జాబితాల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేదు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున భీమిలి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. చీపురుపల్లి నుంచి విద్యా శాఖ మంత్రి, రాష్ట్రంలోనే కీలక నేతల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు మొగ్గుచూపడం లేదు. అందులోనూ గంటా విశాఖపట్నం జిల్లాకు చెందిన నేత. ఇప్పటివరకు గంటా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గాలు.. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ అన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలోనివే. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీకి మొగ్గుచూపుతున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం గంటాను చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని కోరుతున్నారు. ఏకంగా పక్క జిల్లాకు వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు కోరుతుండటాన్ని గంటా ఇష్టపడటం లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు పేరుతో భీమిలి నియోజకవర్గంలో చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఇందులో గంటాకు అనుకూలంగా ఫలితం రావడంతో ఆయనకు సీటు ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. నాలుగో విడత జాబితాలో గంటాను భీమిలి అభ్యర్థిగా ప్రకటించవచ్చని అంటున్నారు.
ఒకవేళ టీడీపీ సీటు రాకపోతే గంటా జనసేన పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీతో, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు గంటాకు ఉన్నాయి. గంటా తనకు నాగబాబు, పవన్ కళ్యాణ్ లా మరో తమ్ముడని స్వయంగా చిరంజీవే పలుమార్లు వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో గంటా జనసేన పార్టీలోకి వచ్చి భీమిలి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా భీమిలి సీటు జనసేన ఖాతాలో చేరింది. అక్కడ జనసేనకు పంచకర్ల సందీప్ ఇంచార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. మరోసారి పోటీకి పంచకర్ల సందీప్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 1999లో తొలిసారి టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2004లో అదే పార్టీ తరఫున చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం దక్కించుకున్నారు. ఇక 2014లో టీడీపీలోకి వచ్చి భీమిలి నుంచి గెలుపొందారు. 2019 మళ్లీ నియోజకవర్గం మార్చి విశాఖ ఉత్తరం నుంచి గెలుపు బావుటా ఎగురవేశారు.
పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఏదైనా ఓడిపోకుండా గెలుపొందడం గంటా శ్రీనివాసరావు స్పెషాలిటీ. కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచిన 2004, 2009 ఎన్నికల్లోనూ, వైసీపీ ప్రభంజనం వీచిన 2019 ఎన్నికల్లోనూ గంటా శ్రీనివాసరావు గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. అలాంటి నేతకు ఈసారి మాత్రం ఇప్పటివరకు సీటు లభించలేదు.