సంచలన ఆరోపణల గంటా.. కమోడ్ రూ.25లక్షలు.. బాత్రూం టాప్ రూ.6లక్షలు!
దీనిపై మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. రుషికొండలో సీఎం జగన్ నివసించేందుకు వీలుగా నిర్మిస్తున్న నివాసంపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 13 Oct 2023 4:02 AM GMTసంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అధికారంలో ఉన్నప్పుడు హవా ప్రదర్శించే ఆయన.. తానున్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళలో మాత్రం పత్తా లేకుండా పోతారన్న పేరుంది. అందుకు తగ్గట్లే గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన బయటకు వచ్చింది.. మాట్లాడింది తక్కువే. ఎన్నికలు కొద్ది నెలల దూరంలో ఉన్న వేళ.. ఆయన బయటకు వస్తున్నారు. తాజాగా సంచలన ఆరోపణలతో తన పేరు అందరి నోటా నానేలా చేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు వస్తున్నట్లుగా చెప్పటంతో పాటు.. ఈ దసరాకు తాను షిప్టు అవుతున్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.దీనిపై మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. రుషికొండలో సీఎం జగన్ నివసించేందుకు వీలుగా నిర్మిస్తున్న నివాసంపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుషికొండపై నిర్మిస్తున్న నివాసాలకు సుమారు రూ.286 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కోసం కడుతున్న భవనాల పనుల్ని చూస్తుంటే.. సద్దాం హుస్సేన్.. గాలి జనార్దన్ రెడ్డి ఇళ్ల మాదిరి భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా విమర్శలకు దిగారు. సదరు భవనంలోని బాత్రూం కమోడ్ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారని.. వాటర్ టాప్ కోసమే రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇందుకోసం దొడ్డి దారిన రహస్య జీవోల్ని తెచ్చినట్లుగా ఆరోపించారు.
ఈ భవనాల్లో మార్బుల్ కోసం చదరపు అడుగు రూ.25 వేలు ఖర్చు చేస్తున్నారని.. ఇదంతా సీక్రెట్ గా సాగుతుందన్నారు. త్వరలోనే ఈ విలాసవంతమైన ఇళ్ల గురించి ప్రపంచానికి తెలిసే రోజు దగ్గరకు వచ్చిందన్నారు. బాత్ టబ్ ధర రూ.26 లక్షలని.. సోఫాలు.. బల్లలు.. కుర్చీలు.. టేబుళ్ల (ఫర్నీచర్) కోసం పెట్టిన ఖర్చు రూ.14 కోట్లుగా చెప్పారు. ఇంట్లో ఇంటీరియర్స్ కోసం పెట్టిన ఖర్చురూ.19.5 కోట్లు అని.. సీవరేజ్ సౌకర్యంతో పాటు.. వాటర్ కనెక్షన్.. విద్యుత్ కనెక్షన్ల కోసం పెట్టిన ఖర్చు రూ.28కోట్లుగా పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వానికి మరో వంద రోజులు మాత్రమే గడువు ఉందన్న గంటా శ్రీనివాసరావు.. తాను చేసిన ఆరోపణలకు ఏదైనా ఆధారాల్ని చూపించి ఆరోపించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆధారాల్ని చూపించకుండా మాట్లాడే మాటలకు విలువేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.