గంటాకు సీటు ఎక్కడ....!?
విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీటు ఎక్కడ అన్న ప్రశ్న ఆయన అనుచరులలో ఉంది.
By: Tupaki Desk | 30 Jan 2024 2:30 AM GMTవిశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీటు ఎక్కడ అన్న ప్రశ్న ఆయన అనుచరులలో ఉంది. గంటా ఓటమేరుగని వీరుడు. ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గం తీసుకుని మరీ పోటీ చేస్తూంటారు. ఇప్పటికి ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన గంటా వరసగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను మార్చారు.
ఇపుడు ఆయన మళ్ళీ వాటిలోనే ఒకదాన్ని ఎంచుకుని పోటీ చేయాలని చూస్తున్నట్లుగా భోగట్టా. గంటా చోడవరం, అనకాపల్లి, భీమునిపట్నం సీట్ల మీద కన్ను వేశారని అంటున్నారు. ఈ సీట్లలో ఏది ఇచ్చినా తాను గెలుస్తాను అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో అధినాయకత్వం మనసులో మాటను ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు
అయితే హై కమాండ్ నుంచి సరైన స్పందన అయితే రాలేదని అంటున్నారు. ఎక్కడో ఒక చోట చూద్దాం. అలా కాకుంటే చాలా అవకాశాలు ఉన్నాయని టీడీపీ పెద్దలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దానిని బట్టి చూస్తే గంటాకు ఎమ్మెల్యే సీటు ఈసారి ఇస్తారా లేదా అన్న కలవరం అయితే ఆయన అనుచరులలో మొదలైంది అంటున్నారు.
గంటా నాలుగేళ్ల పాటు టీడీపీలో చురుకుగా పనిచేయకపోవడం, ఆయన అధికార వైసీపీలోకి వెళ్లాలని చూసినట్లుగా ప్రచారం సాగడం, అధినాయకత్వం అభిప్రాయాలతో విభేదించినట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తానుగా నిర్ణయాలు తీసుకుని మరీ రాజీనామా చేయడం ఒక దశలో విశాఖ రాజధాని విషయంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఇపుడు హై కమాండ్ పరిశీలిస్తోంది అని అంటున్నారు.
ఇపుడు గంటాకు టికెట్ ఇవ్వాలనుకుంటున్న వాటిలో కూడా జనసేన కోరుతున్న సీట్లే ఉండడం కూడా ఆయనకు అక్కడ హామీ దక్కకపోవడానికి కారణం అంటున్నారు. గంటా విషయంలో ఏమైనా ఆలోచిస్తే ఆయనను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని కోరుతారు అని అంటున్నారు. అంతే కాదు అక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన అంగబలం అర్ధబలం సమకూర్చమని కూడా చెబుతారు అని అంటున్నారు.
అది కూడా కాకుంటే మాత్రం గంటాకు ఎన్నికలలో బాగా పని చేయమని చెప్పి ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి లాంటిది ఇస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా హవా ఎపుడూ ఏ పార్టీలో ఉన్నా సాగుతూనే ఉంటుంది. ఇపుడు మాత్రం ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. మరి గంటాకు టికెట్ దక్కుతుందా లేదా అన్నది ఆయన అనుచరులను వేధిస్తున్న ప్రశ్నగానే ఉంది అని అంటున్నారు.