బొత్స మీదకు గంటా అస్త్రం...విశాఖకు గుడ్ బై....!?
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖతో రాజకీయ రుణం తీరిపోతోందా
By: Tupaki Desk | 20 Feb 2024 4:00 PM GMTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖతో రాజకీయ రుణం తీరిపోతోందా. ఆయనను విజయనగరం జిల్లాకు చంద్రబాబు షిఫ్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు. గంటా పాతికేళ్ల రాజకీయ జీవితం విశాఖ జిల్లాలోనే గడచింది. ఆయన ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన సీటులో పోటీ చేయకుండా గెలుస్తూ వచ్చారు. అలా విశాఖ జిల్లాలో నాలుగు సీట్లను చుట్టేశారు. ఇక మరి కొన్ని సీట్లు సీనియర్లకు అడ్డాగా ఉన్నాయి. దాంతో ఆయా సీట్లలోకి ఆయన వెళ్లలేరు. రిజర్వ్ సీట్లు మూడు ఉన్న చోట అసలు పోటీ చేయలేరు.
ఇక ఈ సీట్లలోనే ఆయన మళ్లీ పోటీకి దిగాలి. దానికి గంటా ఓకే కానీ ఆయనను ఏకంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో నుంచి తప్పించేందుకు టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాని వల్ల రెండిందాల లాభం అని భావిస్తోంది. విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు ఆయనకు మధ్య గొడవలతో చీలిన పార్టీ పటిష్టం అవుతుందని, అలాగే విజయనగరం జిల్లా రాజకీయాల్లో బలమైన రాజకీయం ఏర్పడుతుంది అని మరో ఆలోచన
ఇక విజయనగరం జిల్లాలో గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఆ సీటు నుంచి ఇప్పటికి మూడు సార్లు విజయం సాధించారు. ఆయన మరోసారి పోటీ చేసి విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో బొత్స రాజకీయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కావడంలేదు.
ఆయన ఉంటే చాలు వైసీపీకి అన్నట్లుగా సీన్ ఉంది. ఆయన వైసీపీని మరోసారి మెజారిటీ సీట్లలో జిల్లాను గెలిపించేట్టుగా ఉన్నారు. ఆయన మీద పోటీ పడుతున్న వారు మాజీ మంత్రి కిమిడి మృణాళికి కుమారుడు నాగార్జున. రాజకీయాలకు కొత్త అయినా నాగార్జున బాగానే దూకుడు చేస్తున్నారు. అయితే బొత్సను ఓడించడం అంత తేలిక కాదు. అందుకే చంద్రబాబు ఈసారి బొత్సను ఓడించాల్సిందే అన్నట్లుగా వ్యూహరచన చేస్తున్నారుట.
బొత్సను ఓడిస్తే ఉత్తరాంధ్రా రాజకీయాల్లో ఎదురులేదు అన్నట్లుగా ఉంటుంది అని కూడా ఆలోచన ఉంది అంటున్నారు. అలాగే చీపురుపల్లి సీటు ఒకనాడు టీడీపీకి కంచుకోట. అలాంటి సీట్లో బొత్స ఎదురులేని నేతగా ఉన్నారు. అక్కడే ఆయనకు చెక్ పెడితే ఇక రాజకీయం మొత్తం టీడీపీకి అనుకూలం అవుతుంది అని లెక్కలేస్తున్నారుట.
దాంతో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి బదిలీ చేస్తున్నారుట. అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండమని సూచించారు అని అంటున్నారు. ఇక చీపురుపల్లిలో గంటా అభ్యర్ధిత్వం మీద రాబిన్ శర్మ నాయకత్వంలోని టీం ఒక సర్వే చేసి నివేదిక ఇచ్చిన మీదట గంటా అభ్యర్ధిత్వం ఖరారు చేస్తారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే విశాఖ ఉత్తరం సీటు నుంచి కూడా గంటాను తప్పించేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. లోకేష్ శంఖారావం సభలోనే బాలయ్య చిన్నల్లుడు గంటా వేదిక మీద ఉండగానే ఉత్తరం బాధ్యతలు నావి అని స్టేట్మెంట్ ఇచ్చెశారు. ఉత్తరం లో గంటా అందుబాటులోకి లేకపోయినా తాను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అని బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ హామీ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
గంటాకు ఈసారి ఉత్తరం నుంచి సీటు ఇవ్వరు, ఇచ్చినా ఆయన గెలవరు అని సర్వే నివేదికలు ఉన్నాయట. మరో వైపు చూస్తే బాలయ్య అల్లుడు విశాఖ ఎంపీ గా పోటీ చేయాలని చూస్తున్నారు. ఒక వేళ ఆ సీటు బీజేపీకి పొత్తులో వెళ్తే ఆయన అసెంబ్లీకి రావాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
శ్రీభరత్ భీమిలీ వైపు చూస్తున్నారు. అక్కడ జనసేనకు పొత్తులో భాగంగా సీట్లు ఇస్తారని అంటున్నారు. అలాగే విశాఖ సౌత్ వైపు కూడా ఆయన చూపు ఉంది. కానీ ఆ సీటులో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉన్నారు. ఇపుడు ఉత్తరం సీటు మాత్రమే ఖాళీగా ఉంది. దాంతో అక్కడ నుంచి పోటీకి శ్రీభరత్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తం మీద విశాఖ జిల్లాలో గంటాకు సీటు లేదని ఆయన విజయనగరం షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పడానికి వరసగా అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయని అంటున్నారు.