ఓటమిలేని 'గంటా'కు ఈసారి ఎదురీతేనా ?!
పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడు. కానీ ఇప్పటి వరకు పోటీ చేసిన నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేయలేదు
By: Tupaki Desk | 21 April 2024 4:30 PM GMTపాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడు. కానీ ఇప్పటి వరకు పోటీ చేసిన నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేయలేదు. తొలిసారి గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుండే మళ్లీ పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధిస్తారా ? ఓటమి పాలవుతారా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
1999లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన గంటా 2004లో చోడవరం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి శాసనసభ స్థానం నుండి విజయం సాధించాడు. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. 2014లో తిరిగి టీడీపీలో చేరి భీమిలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019లో తిరిగి టీడీపీ నుండి విశాఖ ఉత్తర శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో గతంలో పోటీ చేసిన భీమిలి నుండి మళ్లీ పోటీకి వచ్చిన గంటాకు ప్రజల నుండి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. గంటా ఎక్కడి నుండి పోటీ చేసినా ఆయనను కలవాలంటే విశాఖకు వెళ్లాల్సిందేనని, గంటల తరబడి వేచిచూస్తే గానీ కలిసే అవకాశం ఉండదని, మొదట గన్ మెన్లు, తర్వాత పీఎను దాటితే గానీ ఆయన దర్శనం లభించదని, ఐదేళ్లు బీమిలి ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ స్థానిక సర్పంచుల పేర్లు కూడా ఆయనకు తెలియవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను దాటుకుని గంటా ఎంతవరకు రానిస్తారో ? వేచిచూడాలి