Begin typing your search above and press return to search.

గంటా ఎంత సౌండ్ చేసినా...బాబు మార్కులు అయ్యన్నకేనా...?

ఈ ఇద్దరిలో సీనియర్ మోస్ట్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మరో నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:49 AM GMT
గంటా ఎంత సౌండ్ చేసినా...బాబు  మార్కులు  అయ్యన్నకేనా...?
X

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మధ్య రసవత్తరమైన రాజకీయం పార్టీలో సాగుతూ ఉంటుంది. ఆధిపత్య పోరు అయితే సాగుతూ ఉంటుంది. ఈ ఇద్దరిలో సీనియర్ మోస్ట్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మరో నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఎవరి రూట్ వారిదే అన్నట్టుగా ఉంటారు.

ఇక చంద్రబాబుకు జిల్లాలో ఇద్దరు నేతలూ కావాలి. అదే విధంగా ఇద్దరినీ ఆయన ముందు పెట్టి పార్టీ కోసం పనిచేయిస్తూంటారు. ఇక అయ్యన్నపాత్రుడు అయితే 2019లో టీడీపీ ఓడాక వైసీపీ ప్రభుత్వం మీద పోరాడుతూ వస్తున్నారు. గంటా నాలుగేళ్ల పాటు పెద్దగా చప్పుడు చేయలేదు. అయితే అనారోగ్య సమస్యల వల్లనే ఆయన ఇలా ఉన్నారని అంటారు.

మొత్తానికి గంటా ఇటీవల కాలంలో చురుకు అయ్యారు. పార్టీ కోసం గట్టిగానే పనిచేస్తున్నారు. ఆయన చంద్రబాబుతో పాటు చినబాబు లోకేష్ బాబుతో నూ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు నేతలూ పోటాపోటీగా జిల్లాలో ఉన్నా కూడా కీలక సమయంలో అధినాయకత్వం మాత్రం గంటా కంటే అయ్యన్నకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది అన్నది మరోసారి రుజువు అయింది అంటున్నారు.

విశాఖ జిల్లా నుంచి టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీలోకి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తీసుకున్నారు. ఆయనకు యనమల రామక్రిష్ణుడు అచ్చెన్నపాత్రుడు తరువాత ప్లేస్ ఇచ్చారు. అదే సమయంలో గంటా శ్రీనివాసరావుకు మాత్రం చోటు కల్పించలేదు. దాంతో ఎంత బిగ్ సౌండ్ చేసినా గొంతు సవరించినా గంటా అయ్యన్న కంటే వెనకనే ఉన్నారా అన్న చర్చ వస్తోంది.

పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు అయ్యన్న లాంటి వారినే నమ్ముతోందా అన్న చర్చ కూడా వస్తోంది. చంద్రబాబు లోకేష్ బాబు అంటూ గంటా ఎంతలా దూకుడు చేస్తున్నా అయ్యన్న ప్రయారిటీ అయితే టీడీపీలో చాలానే ఉంది అంటున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. అయ్యన్న టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీని వీడి ఎపుడూ దూరంగా లేరు. పైగా చంద్రబాబుకి వీర విధేయుడు.

ఇటీవలనే ఆయన పార్టీ కోసం ఏకంగా ప్రాణత్యాగం చేస్తాను అని ప్రకటించారు. కేవలం చంద్రబాబు టీడీపీ కోసం ఆయన జగన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. తన మీద కేసులు కూడా పదిహేను దాకా పెట్టించుకున్నారు. ఒక విధంగా నాలుగున్నరేళ్లలో గట్టిగా పోరాడారు. దాంతోనే పార్టీ ఆయన్ని నమ్మి పెద్ద పీట వేసింది అంటున్నారు. అంతే కాదు పొలిట్ బ్యూరోలో కూడా అయ్యన్న మొదటి నుంచి కొనసాగుతున్నారు. దాంతోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ అన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన దానిలో అయ్యన్నకు కీలక పాత్ర ఇచ్చారు అంటున్నారు.

చంద్రబాబు జైలులో ఉన్న టైం లో పార్టీకి దిశానిర్దేశం చేసే కీలకమైన ఈ కమిటీలో అయ్యన్నకు స్థానం లభించడం ద్వారా టీడీపీలో ఆయన అంటే ఏంటో తెలియచేశారు అంటున్నారు. గంటా పార్టీలో సీనియర్ నాయకుడే కానీ అధినాయకత్వం దగ్గర మార్కులు వేయించుకున్నది మాత్రం అయ్యన్న మాత్రమే అంటున్నారు. మరి అయ్యన్న జోరు జిల్లాలో ముందు ముందు ఎలా ఉండబోతోందో చూడాలని అంటున్నారు.