Begin typing your search above and press return to search.

గంటాకు అక్కడ సెట్ చేస్తున్న బాబు...!?

అంతేకాదు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో ఏపీలో వైసీపీ ఓటమి అంతే నిజం అని ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా వాడారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:36 AM GMT
గంటాకు అక్కడ సెట్ చేస్తున్న బాబు...!?
X

మొత్తానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూల్ అవుతున్నారు. ఆయన టోన్ మారింది. తనను హఠాత్తుగా జిల్లా మారి చీపురుపల్లి వెళ్లమని పార్టీ ఆదేశించడంతో ఆగ్రహించిన గంటా మీడియా సమావేశం పెట్టి మరీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతే కాదు పార్టీని మారిన వారిని కూడా సమర్ధించేలా మాట్లాడారు. దాని అర్ధం తాను కూడా పార్టీ మారబోతున్నాను అని సంకేతాలు ఇచ్చారు అని అంటున్నారు.

అయితే ఇది జరిగిన తరువాత టీడీపీ హై కమాండ్ గంటాను పిలిపించుకుంది. ఆదివారం చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి నివాసానికి వెళ్ళి గంటా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిసాయని అంటున్నారు. బయటకు వచ్చిన గంటా ఫుల్ జోష్ తో కనిపించారు. అంతేకాదు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో ఏపీలో వైసీపీ ఓటమి అంతే నిజం అని ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా వాడారు.

దీనిని బట్టి చంద్రబాబు నుంచి ఆయనకు మంచి హామీ లభించింది అని అంటున్నారు. గంటా కూడా ఇదే విషయం చెప్పారు. తన సీటు విషయం చంద్రబాబు చూసుకుంటారు అని ఆయన చెప్పడమే విశేషం. ఇక గంటా భీమిలీ టికెట్ అడిగారు అని తెలుస్తోంది.

అయితే భీమిలీ టికెట్ ని జనసేనకు కేటాయిస్తున్న నేపధ్యంలో గంటా కోరుకుంటున్న చోడవరం సీటుని కూడా పరిశీలించేందుకు టీడీపీ అంగీకరించింది అని అంటున్నారు. అదే విధంగా చోడవరంలో కనుక కుదరకపోతే గంటాకు మాడుగుల సీటు ఇస్తారని అంటున్నారు.

మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుతో పాటు, ఇంచార్జి పీవీజీ కుమార్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇపుడు కొత్తగా పైలా ప్రసాద్ అని ఎన్నారై కూడా వచ్చి చేరారు. ఈ ముగ్గురి మధ్యన పోటీ సాగుతోంది. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇబ్బందే అన్నట్లుగా ఉంది. పైగా మాడుగుల సీటు వైసీపీకి కంచుకోటగా మారింది.

అక్కడ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వరసగా రెండు సార్లు గెలిచారు. ఆయన హ్యాట్రిక్ విజయం కోసం చూస్తున్నారు. దాంతో ఆయనను ఓడించేందుకు గంటాకు అక్కడ నుంచి టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అదే నిజమైతే గంటా మాడుగులకు షిఫ్ట్ అవుతారు అని అంటున్నారు.

అదే విధంగా ఆయనకు ఎపుడూ అచ్చి వచ్చే విధంగా కొత్త నియోజకవర్గం సెంటిమెంట్ కూడా కొనసాగుతుంది అని అంటున్నారు. జిల్లా మారకుండా విశాఖ నుంచి ఎక్కడ పోటీ చేయమన్నా గంటా రెడీ అంటున్నారు. సో గంటా విషయంలో అధినాయకత్వం కూడా పునరాలోచించి ఆయనకు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటా మళ్లీ టీడీపీలో తన పట్టుని నిరూపించుకున్నారు అని అంటున్నారు.