పాపం గంటా : వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు...!
కానీ ప్రతీ సారీ చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఆయన పోటీ చేస్తూ వచ్చారు.
By: Tupaki Desk | 24 Jan 2024 2:04 PM GMTగంటా శ్రీనివాసరావు, టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే. గంటాది పాతికేళ్ల రాజకీయ జీవితం ఆయన ఎపుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ఆయన ఇప్పటికి ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ప్రతీ సారీ చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఆయన పోటీ చేస్తూ వచ్చారు.
కానీ ఫస్ట్ టైం ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. అలా వైసీపీ ఆయన దూకుడుకు చెక్ పెట్టింది. గత కొంతకాలంగా గంటా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వానికి పెను సవాల్ గా మారుతున్నారు. జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే గంటా 2019లో టీడీపీ తరఫున విశాఖ నార్త్ నుంచి గెలిచినప్పటికీ నాలుగేళ్ల పాటు టీడీపీ నుంచి ఎలాంటి పొరాటం చేయలేదు.
టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంటే దాని మీద దాడి జరిగితే కూడా గంటా నుంచి నో సౌండ్ అని ప్రచారం సాగింది. అలాగే చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కంట నీరు పెట్టుకుని మీడియా ముందు విలపించినా గంటా నుంచి పెద్దగా స్పందన లేదు అని కూడా అంటారు. అలాంటి గంటా ఒక దశలో వైసీపీలోకి వెళ్లాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నా నాటి మంత్రి ప్రస్తుత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చివరి నిముషంలో ఆయన రాక పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగిపోయారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.
మొత్తానికి ఏదైతేనేమి గంటా టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే గంటా టీడీపీ అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని సందర్భాలలో వ్యవహరించారు. మూడు రాజధానులకు ఆయన మొదట్లో మద్దతు ప్రకటించారు. అది టీడీపీ స్టాండ్ కి వ్యతిరేకమైనదే. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తే గంటా వెంటనే రాజీనామా చేశారు. అది కూడా పార్టీ అధినాయకత్వానికి చెప్పకుండా ఆయన అలా చేశారు అని చెబుతారు.
దాంతో టీడీపీ బిగ్ ట్రబుల్ లో పడేలా చేసారు అని అంటారు. అప్పట్లో ఆయన రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నిక వస్తే గెలిచి రాజకీయంగా హీరో కావాలని భావించారు అని చెబుతారు. ఆనాడు తన రాజీనామా ఆమోదించాలని గంటా అనేకసార్లు డిమాండ్ చేశారు. ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లి మరీ రాజీనామా గురించి ఆయన చర్చించారు.
అయితే ఆ పని జరగలేదు మొత్తానికి గంటా రాజీనామా ఇక ఆమోదం పొందదు అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో వ్యూహాత్మకంగా వైసీపీ ఆయన రాజీనామాను ఆమోదించేలా పావులు కదిపింది. దీంతో అటు టీడీపీ ఇటు గంటా కూడా షాక్ కి గురి అయ్యారు. దాంతో గంటా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు లేకుండా పోతుంది. ఈ రోజు నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయారు.
అయితే దీని మీద గంటా మీడియా సమావేశం పెట్టి వైసీపీ మీద జగన్ మీద నిప్పులు చెరిగారు. తనకు భయపడే ఇలా జగన్ చేశారు అని అన్నారు మొత్తం యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారంతా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తారని కూడా సంచలన కామెంట్స్ చేశారు
గంటా విమర్శలు పక్కన పెడితే ఆయన మీద కూడా వైసీపీ వైపు నుంచి ప్రతి విమర్శలు వస్తున్నాయి. గంటా ఒక ఓటుకూ వైసీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నిస్తున్నారు. గంటా రాజీనామా చేసింది ఆమోదించుకోవడానికా లేక సరదాకా అని కూడా కౌంటర్లు వేస్తున్నారు
గంటాకు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద చిత్తశుద్ధి ఉందా అని నెటిజన్లు కూడా అడుగుతున్నారు. గంటా రాజీనామాను ఆమోదిస్తే వెల్ కం చేయాలి కానీ ఈ విమర్శలు ఏంటి అని కూడా అంటున్నారు. రాజీనామా విషయంలో తనను సంప్రదించలేదు అని గంటా అంటున్నారు. అయితే అది స్పీకర్ విచక్షణ బట్టి ఉంటుంది అని అంటున్నారు.
జస్ట్ లాంచనమే తప్ప నిజంగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. పైగా గంటావే స్వయంగా తన రాజీనామా ఆమోదించమని ఒకసారి స్పీకర్ ని కలసి కోరారని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఆయన మనసు మార్చుకుంటే తన రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సింది అని అంటున్నారు.
గంటా ఏమీ చేయకుండా రాజీనామా విషయం అలా వదిలేసి తన రాజకీయం తాను చేసుకుంటే అది రాజీనామానా లేక డ్రామానా అన్న ప్రశ్నలు కూడా వైసీపీ నుంచి వస్తున్నాయి. మొత్తానికి గంటా ఒక వైపు స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి రాజీనామా చేసి క్రెడిట్ తీసుకోవాలని అనుకున్నారని, ఆ తరువాత ఆయన ఎమ్మెల్యేగా కూడా కొనసాగాలని చూసారని అయితే ఆయన వ్రతమూ ఫలితామూ రెండింటికీ చివరలో అయినా వైసీపీ దెబ్బ కొట్టింది అని అంటున్నారు. న్యాయ సలహా అని గంటా అంటున్నా స్పీకర్ డెసిషన్ ని ఎవరూ ప్రశ్నించలేరు అన్నది గుర్తు చేసుకోవాలని అంటున్నారు.