Begin typing your search above and press return to search.

బొత్స మీద గంటా హాట్ కామెంట్స్...!

ఆ ఇద్దరిలో ఒకరు వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ ఇద్దరికీ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 2:19 PM GMT
బొత్స మీద గంటా హాట్ కామెంట్స్...!
X

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరూ ఉత్తరాంధ్రాలో కీలక నేతలే. మంత్రులుగా పనిచేసిన వారే. రాజకీయ ఉద్ధండులే. ఆ ఇద్దరిలో ఒకరు వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ ఇద్దరికీ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.

ఇద్దరూ పార్టీలు మారారు. ఇద్దరూ విద్యా శాఖను చూశారు. ఇద్దరూ ఎంపీలుగా 1999లో మొదటిసారి నెగ్గారు. ఇక బొత్స 1996 నుంచి ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 1996, 1998లలో రెండు సార్లు బొబ్బిలి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక 1999లో మొదటిసారి గెలిచారు. ఆయన 2004 లో చీపురుపల్లి అసెంబ్లీని తన సొంత సీటుగా చేసుకుని గెలిచారు. అలా వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019లో మరోసారి ఆయన గెలిచారు. 2014లో మాత్రం విభజన ఏపీలో కాంగ్రెస్ తరఫున చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో మాత్రం వైసీపీ తరఫున గెలిచారు. మంత్రిగా కూడా అయిదేళ్ల పాటు వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే బొత్స గంటాల మధ్య రాజకీయ సమరం సాగుతుందా అన్న చర్చ అయితే కొద్ది రోజులుగా సాగుతోంది. బొత్సను ఈసారి ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. ఆయన సీటు చీపురుపల్లికి గంటాను పంపించాలని చూస్తున్నారు. గంటా అక్కడ పోటీ చేస్తే విజయం సాధిస్తారు అన్నది బాబు నమ్మకం అంటున్నారు.

గంటా రాజకీయ చాణక్యుడు. పైగా అంగబలం అర్ధబలం బాగా ఉన్న వారు. టీడీపీ మంత్రిగా ఉన్న టైం లో ఆయన విజయనగరం జిల్లా ఇంచార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనకు విజయనగరం జిల్లా రాజకీయాల మీద అవగాహన ఉంది. పైగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి బొత్సను ఓడిస్తారు అన్నది బాబు ఆలోచన.

ఇదిలా ఉంటే విశాఖలో మీడియా సమావేశం పెట్టిన గంటా ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. అదే టైం లో బొత్స మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయక్పోవడానికి ఆయన అనేక కారణాలు చెప్పారు. తన జిల్లా విశాఖ అని పక్క జిల్లాకు వెళ్లడం ఎందుకు అన్నది ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు.

ఇక తన మీద ఎవరు పోటీ చేసినా విజయం తనదే అని బొత్స ఆ మధ్య చేసిన కామెంట్స్ ని మీడియా గంటా దృష్టికి తీసుకుని వచ్చింది. దానికి ఆయన జవాబు ఇస్తూ తాను పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఓటమి ఎరగలేదని అన్నారు. అదే బొత్స మాత్రం ఇప్పటికి మూడు సార్లు ఓడారు అని గుర్తు చేశారు.

ఆయన 1996, 1998 లలో ఎంపీగా అలాగే 2014లో ఎమ్మెల్యేగా ఓటమి చెందారని అన్నారు. ఆయనకు ఓటమి అనుభవం ఉందని తనకు లేదని సెటైర్లు వేశారు. అంటే తాను చీపురుపల్లిలో పోటీ చేస్తే కచ్చితంగా బొత్సను ఓడిస్తాను అన్న ధీమా అయితే మాజీ మంత్రి వ్యక్తం చేశారు. అయితే తాను మాత్రం విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నాను అని ఆయన అంటున్నారు.

భీమిలీ నుంచి పోటీకి గంటా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన తన కసరత్తుని కూడా మొదలెట్టారని టాక్ నడుస్తోంది. అయితే బొత్స మీద గంటా వేసిన ఈ సెటైర్లు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

ఒక వేళ చంద్రబాబు గట్టిగా బలవంతం చేస్తే చీపురుపల్లి వెళ్ళి మరీ గంటా పోటీ చేస్తారా అందుకేనా బొత్స మీద ఫస్ట్ టైం ఇలా రియాక్ట్ అయ్యారు అని ఆలోచిస్తున్నారు. ఓటమి లేని వీరుడు కాబట్టే చంద్రబాబు కూడా గంటాను అక్కడ పోటీకి ఎంపిక చేశారు అని కూడా అంటున్నారు. మరి గంటా చేసిన ఈ కామెంట్స్ మీద బొత్స ఎలా రియాక్ట్ అవుతారో. అదే విధంగా ఓటమి తనకు తెలియదు అంటున్న గంటాకు బొత్స దాన్ని రుచి చూపిస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో సాగుతోంది.