Begin typing your search above and press return to search.

'గరికపాటి'.. మరో కలకలం!

ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారని గరికపాటి నరసింహారావు మండిపడ్డారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 5:51 AM GMT
గరికపాటి.. మరో కలకలం!
X

ప్రముఖ ప్రవచనకర్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహారావుకు మంచి పేరుంది. ఇందుకు గానూ ఆయన పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. అయితే ఆయన తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో వివాదాల్లో కూరుకుపోతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలానికి దారితీశాయి.

ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారని గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ను ప్రస్తుతం ఏపీగా పిలుస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరులో భగవద్గీత ప్రచార పరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో తెలుగు భాష పరిరక్షణ కాస్తంత మెరుగ్గా ఉందని గరికపాటి నరసింహారావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణను సైతం టీఎస్‌గా పిలుచుకునే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గరికపాటి కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌ గా మారాయి.

గతంలోనూ ఆయన విశ్వబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. విశ్వబ్రాహ్మణులు నిరసనలకు పిలుపునిచ్చారు. పోలీసులకు సైతం గరికపాటిపై ఫిర్యాదు చేశారు. ఆయన తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో గరికపాటి స్వర్ణకారులకు క్షమాపణ కూడా చెప్పారు. తాను ఎవరినీ కించపరచాలని మాట్లాడలేదని, విశ్వ బ్రాహ్మణులకు బాధకలిగితే, తనకు బాధ కలిగినట్టే అని చెప్పారు. చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానన్నారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.

అలాగే గతంలో పుష్ప సినిమాపైనా గరికపాటి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఒక స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏంటీ అంటూ నిలదీశారు. అలాగే ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడటం కూడా వివాదం రేపింది. ఇందుకు ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు భాషపై, రాష్ట్రాన్ని ఏపీగా పిలుస్తుండటంపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఏ కల్లోలానికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే. అందులోనూ తమ పాలనపై ఎవరైనా మాట్లాడితే రెచ్చిపోయే వైసీపీ నేతలు గరికపాటిని లక్ష్యంగా చేసుకునే వీలుందని అంటున్నారు.

వైసీపీ పాలనలోనే తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోతోందని గతంలో పలువురు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధనను ఎత్తేసి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని పలువురు నిరసించారు. ఇలాంటి వారిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పేదలకు వ్యతిరేకులని.. పేద పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడం వారికి ఇష్టం లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల ఫలితం ఎటు దారితీస్తుందో!