రాయ్ బరేలీలో ముందు గెలవండి.. రాహుల్ కు చెస్ దిగ్గజం పంచ్
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీకి.. దిగ్గజ చెస్ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ కు లింకేంటి?
By: Tupaki Desk | 4 May 2024 4:30 AM GMTకాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీకి.. దిగ్గజ చెస్ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ కు లింకేంటి? తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో రాయ్ బరేలీ బరిలో ఉన్న రాహుల్ ను.. ముందు మీరు ఎన్నికల్లో గెలవమన్న మాట కాస్పరోవ్ నోటి నుంచి ఎందుకు వచ్చింది? అసలేం జరిగిందన్న ఆసక్తికర అంశాల్ని చూస్తే..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న రాహుల్ గాంధీ.. ఇటీవల ఒక రీల్ చేశారు. తాను జర్నీలో ఉన్న వేళలో మొబైల్ లో చెస్ గేమ్ ఆడటం.. ఆ సందర్భంగా ఆ క్రీడ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సదరు వీడియోలో తన అభిమాన చెస్ క్రీడాకారుడిగా రష్యా దిగ్గజ ప్లేయర్ కాస్పరోవ్ గా పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయాలకు చదరంగానికి దగ్గరి రిలేషన్ ఉందన్న రాహుల్.. ఆట మీద ఒకసారి ఫోకస్ చేస్తే.. ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్ ప్లేయర్ గా పేర్కొన్నారు.
ఈ వీడియో వైరల్ గా మారింది. రాహుల్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వీడియోపై స్పందించిన ఒక నెటిజన్ కాస్తంత వ్యంగ్యంగా పోస్టు చేశారు. దిగ్గజ చెస్ క్రీడాకారులు కాస్పరోవ్.. విశ్వనాథన్ ఆనంద్ లు చాలా త్వరగా రిటైర్ అయ్యారని.. వారికి గొప్ప మేథావిని ఎదుర్కొనే అవకాశం రాలేదంటూ పోస్టు చేవారు. ఈ పోస్టుపై కాస్పరోవ్ రియాక్టు అయ్యారు. ముందు రాయబరేలీలో గెలవాలన్న సూచన చేయటంఆసక్తికరంగా మారింది.
రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్ చెస్ లో సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలుమార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన ఆయన.. 2005లో ఆట నుంచి రిటైర్ అయ్యారు. తమ దేశ అధ్యక్షుడు పుతిన్ ను.. ఆయన ప్రభుత్వాన్ని తప్పులు పట్టే కాస్పరోవ్ మీద పుతిన్ ప్రభుత్వం కన్నెర్ర చేయటంతో ఆయన కొన్నేళ్ల క్రితం క్రొయేషియాకు వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో రష్యా ఆయన్ను ఉగ్రవాదులు.. తీవ్రవాదుల జాబితాలో చేర్చటం గమనార్హం. రాహుల్ చెస్ వీడియో మీద దిగ్గజ చెస్ క్రీడాకారుడు స్పందించిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.