20కి.మీ. వేగంతో వెళ్లాల్సిన చోట 120కి.మీ. వేగంతో దౌడు తీయించారు
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. విషయం గురించి తెలిసినంతనే గుండెల్లో రైళ్లు పరిగెత్తే ఉదంతంగా చెప్పాలి
By: Tupaki Desk | 25 May 2024 5:16 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. విషయం గురించి తెలిసినంతనే గుండెల్లో రైళ్లు పరిగెత్తే ఉదంతంగా చెప్పాలి. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సిన చోట.. అందుకు భిన్నంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దౌడు తీయించిన రైల్వే లోకో పైలెట్ల మీద రైల్వే అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. లక్కీగా.. ఈ వ్యవహారంలో వందలాది మంది ప్రయాణికులకు ఏమీ కాకుండా.. క్షేమంగా బయటపడటం విశేషం. అగ్రా కంటోన్మెంట్ సమీపంలో జజువా.. మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఒక రైల్వే వంతెన రిపేర్ వర్కులను ఇటీవల షురూ చేశారు.
ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల వేగాన్ని గంటకు 20 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయినప్పటికీ కొన్ని రైళ్ల లోకో పైలెట్లు మాత్రం.. ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ అమితమైన వేగంతో రైళ్లను దూసుకెళ్లేలా చేశారు. ఈ తీరును ఏ ఒక్క రైలు కాకుండా కొన్ని రైళ్ల లోకో పైలెట్లు చేయటంపై రైల్వే శాఖ సీరియస్ అయ్యింది.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ - ఝూన్సీ జంక్షన్ మధ్య నడిచే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఈ మార్గంలో 120కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయించారు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్న సమయంలోనే జమ్ములోని కాట్రా - ఇండోర్ మధ్య నడిచే మాల్వా ఎక్స్ ప్రెస్ కూడా ఇదే తరహాలో దూసుకెళ్లటాన్ని గుర్తించారు. ఏ ప్రాంతంలో వేగంగా వెళ్లాలి.. ఏ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లాలన్న దానిపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అమితమైన వేగంతో రైళ్లను నడిపిన తీరు షాకింగ్ గా మారింది. అంతా బాగుంది కాబట్టి ఓకే. అదే తేడాగా జరిగి ఉంటే ఎంత భారీ నష్టం వాటిల్లి ఉండేది.. ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేదన్నది ఇప్పుడు చర్చగా మారింది.