నిప్పులు కురిసిన లోక్‌సభ.. మౌనంగా చూస్తుండిపోయిన మోడీ బ్యాచ్!
ఈ క్రమంలో కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్.. లోక్‌సభ దద్దరిల్లే వ్యాఖ్యలతో మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 8 Aug 2023 8:15 AM GMTనిప్పలు కురిశాయి.. అంటారు కదా! అది కళ్లకు కట్టించేలా చూపించింది ఈ రోజు లోక్‌సభ సమావేశం. మ ధ్యాహ్నం 12 గంటలకు వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్‌సభలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టారు.
సభా సంప్రదాయం ప్రకారం.. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన పార్టీకి తొలుత మాట్లాడే అవకాశం ఇస్తారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్.. లోక్‌సభ దద్దరిల్లే వ్యాఖ్యలతో మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
''ఈ దేశంలో వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి. రిక్షా కార్మికుడి నుంచి ఉద్యోగి వరకు అందరిలోనూ చలనం ఉంది. ఇటీవల నేను రాయి రాయి పట్టకుని ఒకదానితో ఒకటి రాపిడి చేశాను. వెంటనే అగ్గి రవ్వ ఎగిసి పడింది. అంటే వాటిలోనూ చలనం కనిపించింది.
కానీ, ఎటొచ్చీ.. మన ప్రధాన మంత్రిలోనే ఎలాంటి చలనం లేకుండా పోయింది! ఇలాంటి ప్రధానిని ప్రపంచంలో నేను ఎక్కడా ఏ దేశంలోనూ చూడలేదు'' అని గొగోయ్ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ పిడుగు పడిన చందంగా నిశ్చేష్టతతో చూస్తుండిపోయింది.
మణిపూర్ అంశం నుంచి అదానీ ఆస్తుల వరకు.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ కథనాల నుంచి నిత్యావసరాల ధరల వరకు.. ఒక్కటేమిటి.. రాష్ట్రాల్లో అధికారాలను కైవసం చేసుకునే విషయంలో పన్నుతున్న కుట్రల వరకు గౌరవ్ గొగోయ్ నిప్పులు చెరుగుతుంటే..సభలోనే ఉన్న బీజేపీ ఉద్ధండులు.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా సహా అనేక మంది నోరు వెళ్ల బెట్టి చూడడమే తప్ప.. నోట మాటలేకుండా పోయింది. ప్రతి వాక్యంలో గొగోయ్ మోడీని టార్గెట్ చేశారు.