ఎలన్ మస్క్ స్పేస్-Xకు అదానీ సవాల్
ఏటికి ఎదురీదడం.. సవాళ్లకే ప్రతి సవాళ్లు విసరడం భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ప్రత్యేకత. ఇప్పుడు అదానీ గ్రూప్ అంతరిక్ష రంగంలోకి ధైర్యంగా అడుగుపెడుతోంది.
By: Tupaki Desk | 20 Feb 2025 10:33 AM GMTఏటికి ఎదురీదడం.. సవాళ్లకే ప్రతి సవాళ్లు విసరడం భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ప్రత్యేకత. ఇప్పుడు అదానీ గ్రూప్ అంతరిక్ష రంగంలోకి ధైర్యంగా అడుగుపెడుతోంది. స్వదేశానికి చెందిన ఈ ప్రయివేట్ సంస్థ భారతదేశపు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)ను తయారు చేయడానికి పోటీ పడుతోంది. ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సహా ప్రపంచ అంతరిక్ష పరిశ్రమ దిగ్గజాలను సవాల్ చేయడమే ధ్యేయంగా అదానీ ఈ కొత్త అడుగు వేస్తున్నారు.
దేశ అంతరిక్ష రంగంలో కీలక అడుగు వేయడమే ధ్యేయంగా భారతదేశపు ఎస్.ఎస్.ఎల్.విని ఉత్పత్తి చేయడానికి ఎంపికైన మూడు ఫైనలిస్టు కంపెనీల్లో అదానీ గ్రూప్ ఒకటి. పోటీలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) రెండూ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు. అదానీ కాంట్రాక్టును గెలిస్తే అదానీ డిఫెన్స్ సిస్టమ్స్, దాని అనుబంధ సంస్థ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో భారతదేశంలో ఈ అంతరిక్ష ప్రయోగ వాహనాలను తయారు చేసే బాధ్యతను తీసుకుంటుంది.
చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్.ఎస్.ఎల్.వి) అనేది చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి, పరిష్కారాలను అందించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అభివృద్ధి చేసిన రాకెట్. ఈ వాహనం 500 కిలోల వరకు పేలోడ్‌లను తక్కువ భూ కక్ష్య (ఎల్.ఇ.వో)లోకి మోసుకెళ్లగలదు. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున ఈ రంగంలో వ్యాపార వాణిజ్యాలకు ఆస్కారం పెరిగింది. ముఖ్యంగా కమ్యూనికేషన్, వాతావరణ అంచనా, భూమి పరిశీలన వంటి పరిశ్రమలలో చిన్న ఉపగ్రహ విస్తరణ అవసరం పెరుగుతున్నందున ఈ రంగంలో రాణించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.
2023లో ఎస్.ఎస్.ఎల్.విని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఈ రంగాన్ని ప్రైవేటీకరించడానికి భారతదేశం తీసుకున్న చర్య సత్ఫలితాన్ని ఇస్తోంది. ఉత్పత్తి, సాంకేతికతను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయాలనే ప్రభుత్వం నిర్ణయం దేశం వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాలను పెంచడం, మార్కెట్లో పొరుగు వారి హవాను తగ్గించడానికి ఉపకరిస్తుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయించే ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో పోటీని ప్రారంభించడం లక్ష్యంగా ఈ ప్రయత్నం సాగుతోంది.
ఎస్.ఎస్.ఎల్.వి ఉత్పత్తికి సంబంధించిన ఒప్పందం 20 కంపెనీల నుండి బిడ్‌లను ఆకర్షించింది. వాహనం తయారీ ప్రక్రియ, డిజైన్ వివరాలు, నాణ్యత హామీ శిక్షణను యాక్సెస్ చేయడానికి బిడ్ విజేత ఇస్రోకి దాదాపు రూ. 3 బిలియన్లు చెల్లిస్తాడు. 24 నెలల పాటు కొనసాగే ఈ ఒప్పందంలో సాంకేతిక మద్దతు, రెండు ఎస్.ఎస్.ఎల్.వి ప్రయోగాలను విజయవంతంగా అమలు చేయడం కూడా ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణ ఆలోచన భారతదేశ అంతరిక్ష పరిశ్రమకు గేమ్-ఛేంజర్ అని నిపుణులు భావిస్తున్నారు. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా, భారతదేశం ప్రపంచ అంతరిక్ష పోటీలో బలమైన పాత్ర పోషించడానికి పెద్ద ఆస్కారం కలుగుతుంది.