'రేమండ్స్'కు విడాకుల ఎఫెక్ట్!
భార్యా భర్తల మధ్య తలెత్తే వివాదాలు.. ఇంటికే పరిమితం కావాలి. ఇక విడాకులైనా.. ఇల్లు-కోర్టుకే పరిమితం కావాలి
By: Tupaki Desk | 1 Dec 2023 1:30 AM GMTభార్యా భర్తల మధ్య తలెత్తే వివాదాలు.. ఇంటికే పరిమితం కావాలి. ఇక విడాకులైనా.. ఇల్లు-కోర్టుకే పరిమితం కావాలి. లేకపోతే.. పెను ప్రమాదాలే పొంచి ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిణామమే తాజాగా వెలుగు చూసింది. దేశంలోను.. ప్రపంచంలోనూ అనేక మంది వ్యాపారవేత్తలైన భార్యాభర్తలు మనస్పర్థలతో విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. అవి వారి వ్యక్తిగతానికే పరిమితం చేసుకున్నారు.
కానీ, భారత్‌లో తాజాగా వెలుగు చూసిన ఓ మిలియనీర్ జంట విడాకుల వ్యవహారం.. వారి వ్యాపారాన్ని నమ్ముకున్న లక్షల మందిపై ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు.. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా.. మానేస్తున్నారు. బ్యాంకులు తమ అప్పులు తీర్చాలంటూ.. క్యూ కడుతున్నాయి. మొత్తానికి విడాకుల మాటేమో.. కానీ.. సదరు కంపెనీకి ఇప్పుడు మరిన్ని సమస్యలు తగులుకున్నాయి.
ఏంటా కంపెనీ..
దేశంలోనే ప్రసిద్ధి చెందిన వస్త్ర వ్యాపారం.. 'రేమండ్స్'. నిజానికి మెజారిటీ వ్యాపారం అంతా.. విదేశాల్లోనే ఉంది. ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా.. వ్యాపారంలో ఉంది. నాణ్యతకు మన్నికకే కాదు.. స్టైలిష్‌కు కూడా.. ఈ రేమండ్ దుస్తులు పెట్టింది పేరు. అయితే.. ఈ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఆయన సతీమణి నవాజ్ మోదీతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో విడాకులకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని గౌతమ్ సింఘానియా ఇటీవల ప్రకటించారు.
అయితే.. ఈ విడాకుల ప్రకటనే ఆ సంస్థ కొంపముంచుతోంది, సింఘానియా విడాకుల ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లోని రేమండ్ షేర్ల విలువ పడిపోతూ వస్తుంది. ఇప్పటికి వరుసగా రేమండ్ షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఇక, గత ఐదు రోజులుగా రేమండ్ షేర్ వ్యాల్యూ 10.6 శాతం పడిపోగా.. 12 రోజుల ట్రేడింగ్‌లో 14 శాతం తగ్గింది. దీంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక నష్టాల పరంపరగా నమోదైంది.
రేమండ్ షేర్ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,000 కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ దంపతుల మధ్య కొనసాగుతున్న వివాదం కంపెనీ షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తోంది. సింఘానియా, నవాజ్ మోదీల మధ్య సెటిల్ మెంట్ వ్యవహారం కోర్టుకు వెళితే రేమండ్ షేర్ హోల్డర్లు మరింత నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సింఘానియా - నవాజ్ మోదీ వివాదంపై రేమాండ్‌లోని పెట్టుబడిదారులు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు ఇప్పటికే లేఖలు సంధిస్తున్నారు. మీరు విడిపోతే రేమండ్ మార్కెట్ వ్యాల్యూమీద, ఆస్తుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు లేఖల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమాండ్ వ్యాపారం నిర్విరామంగా కొనసాగించాలని వారు కోరుతున్నారు.
మరోవైపు.. సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) కోరింది. అంతేకాదు.. విడాకుల వ్యవహారం.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందేలా చేస్తోందని.. వ్యాపారాన్ని మూసేసే అవకాశం ఉందని.. తమ అప్పులు చెల్లించాలని ఎస్‌బీఐ, ఐసీసీఐ బ్యాంకులు కూడా లేఖలు సంధించాయి. మీ మౌనాన్ని తప్పు. సంస్థకు నష్టం చేకూరవచ్చు. ముందు మా బాకీలు చెల్లించండి అని లేఖల్లో స్పష్టం చేశారు.