41 కి.మీ. పొడవు..10 కి.మీ వెడల్పు.. అసలేమీటీ గాజా?
కూల్చడం తేలికే.. నిర్మించడమే కష్టం.. ఇది గాజా విషయంలో సరిగ్గా సరిపోతుంది.
By: Tupaki Desk | 5 Feb 2025 11:30 AM GMTప్రస్తుతం ఈ భూమ్మీద అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నది ఉక్రెయిన్ లోని డాన్ బాస్..ఇజ్రాయెల్ పొరుగున ఉన్న గాజాలోనే..20 లక్షల మంది ప్రజలు కేవలం 41 కి.మీ. పొడవు, 10 కి.మీ వెడల్పు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారంటే..? తాగునీరు, కరెంటు ఇస్తున్నప్పటికీ నిత్యం కత్తులు నూరే శత్రు దేశం.. కటిక పేదరికం.. ఇంకా చెప్పాలంటే అక్కడ బతుకుతున్నా.. బతుకు మీద ఆశ లేదు.
2023 అక్టోబరు 7నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడడంతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇప్పుడు ఎటుచూసినా కల్లోలమే. బాంబుల దాడుల్లో భారీ భవనాలు కూలిపోవడంతో శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి.
కూల్చారు.. కట్టాలంటే 40 ఏళ్లు
కూల్చడం తేలికే.. నిర్మించడమే కష్టం.. ఇది గాజా విషయంలో సరిగ్గా సరిపోతుంది. గాజాను పునర్ నిర్మించాలంటే 40 ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో చాలాచోట్ల శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోయాయి. వాటిని తీసినవారే లేరు.
గాజాను గాజా స్ట్రిప్ గానూ పిలుస్తారు. అంటే ఒక విమానాశ్రయ రన్ వే లాగా పొడవుగా ఉంటుంది కాబట్టి. ఈ ప్రాంతం మధ్యధరా సముద్రం తూర్పు తీరంలో ఉంది. వాస్తవానికి ఇది పాలస్తీనాలో భాగమ. కానీ, గాజాను సాయుధ మిలిటెంట్ సంస్థ అయిన హమాస్ కంట్రోలో చేస్తోంది.
ఉత్తర గాజా, దక్షిణ గాజా, ఖాన్ యూనిస్, రఫా.. ఇవీ గాజాలోని ప్రాంతాలు. గాజా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ పేరిటే పిలుస్తారు. ఐక్యరాజ్య సమితి అబ్జర్వేషన్ కంట్రీ అయిన పాలస్తీనాలో భాగమే గాజా. కానీ, హమాస్ ను పాలస్తీనా అథారిటీ గుర్తించలేదు. వెస్ట్ బ్యాంక్ కేంద్రంగా పనిచేస్తుంది పాలస్తీనా అథారిటీ.
అతి చిన్న భూభాగంలో 20 లక్షలమంది జీవనం సాగిస్తుండడంతో ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఈజిప్ట్ దాదాపు రెండు దశాబ్దాలు గాజాను పాలించింది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో అరబ్ దేశాలపై విజయం సాధించిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పై నియంత్రణ సాధించింది. తర్వాత 38 సంవత్సరాలు గాజాను గుప్పిట పట్టింది. 2005లో అంతర్జాతీయ సమాజం, స్వదేశంలోనూ ఒత్తిడి రావడంతో గాజా నుంచి వైదొలగింది.
2007లో జరిగిన ఎన్నికల్లో గాజాలో అధికారంలోకి వచ్చిన హమాస్ అప్పటినుంచి అధికారంలో ఉంది. మళ్లీ అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు.
2023 అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి విధ్వంసం రేపారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగింది. ఇప్పటివరకు 15 నెలల్లోనే 50 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.