నెత్తిన సామాన్లు, చంకన పిల్లలు... శిథిలాలవైపు లక్షలాది మంది అడుగులు!
అవును... 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్లి హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jan 2025 11:30 PM GMTఅత్యంత దయణీయమైన, హృదయాలను మెలిపెట్టేసే దృశ్యాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది ప్రజలు దక్షిణాదికి తరలివెళ్లిపోగా.. వారంతా ఇప్పుడు నెత్తిన సామాన్లు, చంకన బిడ్డలను పెట్టుకుని నడుచుకుంటూ తిరిగి ఉత్తర గాజాకు తిరిగివస్తున్నారు.
అవును... 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్లి హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలు అన్ని వైపుల నుంచీ దాడి చేస్తూ గాజాను అల్లకల్లోలం చేసేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. దీంతో... అక్కడి ప్రజలంతా దక్షిణాదివైపు తరలిపోయారు.
ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది ఉత్తర గాజా నుంచి దక్షిణాదికి తరలివెళ్లిపోయిన పరిస్థితి. వీరింతా ఇప్పటివరకూ శరణార్థి సిభిరాల్లో కాలం వెళ్లదీశారు. మరోపక్క నాటి నుంచీ హమాస్ లక్ష్యంగా ఉత్తర గాజాను వణికించేసింది ఐడీఎఫ్. దీంతో.. గాజా మొత్తం శిథిలమైపోయింది.. ఎటుచూసిన కూలిన గోడలే కనిపిస్తున్నాయి!
ఈ పరిస్థితుల్లో ఇటీవల హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో.. సుమారు 15 నెలల తర్వాత పాలస్తీనా పౌరులు తమ సొంత ప్రాంతాలవైపు బారులు తీరారు. చేతిలో వస్తువులు పెట్టుకుని, పిల్లల్ని చంకనవేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. ఈ దృశ్యాలు యుద్ధాల వల్ల కలిగే నష్టాలను కళ్లకు కడుతున్నాయి!
ఇలా వీరంతా దక్షిణాది నుంచి తిరిగి ఉత్తరగాజా వైపు కదులుతున్నప్పటికీ.. అసలు తమ స్వస్థలంలో తమకు ఏమైనా మిగిలిందా..? అసలు అది ఎక్కడుందో గుర్తుపట్టేలా పరిస్థితి ఉందా..? ఏదో సొంత ప్రాంతానికి వచ్చినప్పటికీ సర్వం శిథిలమై, ఎటు చూసినా కాంక్రీట్ గోడలు కనిపిస్తున్న చోట ఎలా బ్రతకాలి..? వంటి ప్రశ్నలు వారిని తొలిచేస్తుండగా.. నడక సాగుతోంది.
ఇలాంటి అత్యంత దయణీయమైన పరిస్థితుల్లో లక్షలాది మంది గాజా ప్రజలు దక్షిణం నుంచి ఉత్తరం వైపు బారులు తీరి నడుచుకుంటూ వస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు ఆ రోజు ఇజ్రాయెల్ పౌరులు 1200 మందిని హతమార్చి, సుమారు 250 మందిని బందీలుగా చేసుకున్న ఫలితంగా... సుమారూ 40,000 మంది పాలస్థీనీయులు మరణించారని అంటున్నారు.
లక్షలాది మండి నేడు నిరాశ్రయులై, బ్రతుకు జీవుడా అంటూ కాంక్రీట్ శిథిలాలతో ఉన్న సొంత ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా తమ చర్య వల్ల ఏమి సాధించారో హమాస్ ‘ఉగ్రవాదుల’కే తెలియాలనే మాటలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే స్లొగన్స్ గుర్తుకువస్తున్నాయని చెబుతున్నారు.